02 సెప్టెంబర్ 2025

కవిత : వర్తమానం

సుఖముంటుంది
కన్నతల్లి కనుల ముందు వున్నపుడు,
కన్న ఊరు పాదాలని అంటినపుడు,
మర్యాదల దుమ్ము దులుపుకొని
చిననాటి నేస్తాలతో నోరారా మాట్లాడినపుడు,

అప్పటి చెట్లపై, చెరువుపై
అప్పటి ఎండ కాసినపుడు,
అప్పటి నిద్రలోకి జారుతూ, కప్పల శబ్దాల్లోంచి 
అప్పటి వానచప్పుడు వింటున్నపుడు 
స్వర్గం ఎవరికి కావాలనిపిస్తుంది

మారిన ఊర్లు, వయసులు,
మారిన మనుషులు, మనసులు
చేరిన బరువులు, గాయాలు
వెన్నెల తెల్లబోవడం, 
పగలు చీకటి కురియడం పరిచయం చేసాక, 
నరకం ఎక్కడో లేదని తెలియవస్తుంది

భూమి పైన దొరికేవి
స్వర్గం, నరకమేనా అని తడుముకొంటావు
మెలకువలలో, నిద్రల్లో, ఊహల్లో, కలల్లో;
రెండిటి విముక్తి కోసం తపిస్తావు

దుఃఖం శిఖరాలని చేరినపుడు,
అటు గగనం, ఇటు లోయలూ 
ఒకేసారి బలంగా పిలుస్తున్నపుడు
ఉలికిపడతావు శిలలాంటి వర్తమానంలోకి
బహుశా,
అపుడు నువ్వు ఉండవనుకొంటాను, 
పగటిలో దీపకాంతిలా
వర్తమానంలో నీ ఉనికి లీనం కావచ్చును

బివివి ప్రసాద్

01 సెప్టెంబర్ 2025

కవిత : అనంతం ప్రేమ

మనుషులిద్దరు అకలుషంగా 
కౌగలించుకుంటారు చూసావా
అపుడు వాళ్ళు రెండు చేపలు,
రెండు చీమలు, ఇద్దరు పిల్లలు,
రెండు పక్షుల ముక్కులు,
నీరెండలోని పొడవాటి జంట నీడలు

కౌగిలిలో కనులు మూసుకొని
గాఢమైన నిట్టూర్పు విడిచినపుడు
గ్రహగోళాలకి విస్తరించిన ఒక జీవితం,
మరణాన్ని దాటిన మెలకువ

అనంతం ఎక్కడో లేదు
ప్రేమ రూపంలో తిరుగుతోంది 
మన చుట్టూ, కన్నబిడ్డలా 

అహం ముసుగు వేసుకుని
తప్పించుకోవాలని చూస్తామా,
దుఃఖం ముసుగు వేసుకుని
మన కోసం ఎదురుచూస్తుంది

అకలుషంగా ఇద్దరం సమీపించినపుడు
ఇదిగో, ఇక్కడే ఉన్నానంటూ
ఆకాశం తెర తొలగించి 
మన ముందు వాలుతుంది

బివివి ప్రసాద్