22 సెప్టెంబర్ 2025

కవిత : నీకు నువు గుర్తుకు వచ్చి

చాలా సమయం తర్వాత నీకు నువు గుర్తొస్తావు
 
ఉద్వేగాల్లో మునుగుతూ, ఊహల్లో తేలుతూ,
పనుల్లో కొట్టుకుపోతూ, మనుషుల్లోకి ఈదుతూ
గగనంపై ఎప్పుడు సూర్యకాంతి ఒలికిందో,
సూర్యుడు జారుడుబల్లపై పడమటికి జారాడో,
నక్షత్రాలు గుప్పున వెలిగాయో, 
వీధుల్లోకి నిశ్శబ్దం కాలువలా ప్రవహించిందో 

గమనించకనే రోజు కాగితం గీతలతో నిండుతుంది,
పిచ్చిగీతల కాగితాన్ని నలిపి, విసిరాక,
నిద్రకి ముందు తటాలున నీకు నువు గుర్తొస్తావు

అలసిన మనసునీ, దేహాన్నీ దయగా పరికిస్తావు,
నిను ఏకాంతానికి అప్పగించిన
లోకానికి కృతజ్ఞతలు చెబుతావు,
నిన్ను ఒంటరిగా విడువని చీకటినీ, 
చీకటిలో ఆడుకొనే గాలినీ,
గాలిలో ఊయలలూగే జీవితాన్నీ ప్రేమగా పలకరిస్తావు

రోజు చివరికి చేరాక
నువు జీవిస్తున్నావని గుర్తొస్తుంది,
ఆటల తర్వాత పిల్లలు తల్లిని కౌగలించుకున్నట్లు 
జీవితాన్ని కౌగలించుకుంటావు

జీవితం నక్షత్రాలతో తల నిమిరి,
గాలితో ముఖంపై ముద్దులు ఒంపి,
బ్రతికున్నావు చాలు నా కని నిద్రలోకి పంపిస్తుంది

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి