20 సెప్టెంబర్ 2025

కవిత : ఇలాగైతే తెలీదు

చాలారోజులు 
మనుషుల తలలు చూస్తూ గడిపాక
తటాలున గుర్తొస్తుంది,

ప్రణాళికలు చిట్లిన విరామంలోనో,
కలలల్లోంచి సందేహాల మంచులోకి తప్పినప్పుడో,
నీ మనుషుల నుండి ఊహించని నిశ్శబ్దాల్లో, 
గొంతుల్లో, చూపుల్లో, తప్పించుకోడాల్లోనో 

నీ చుట్టూ పెద్ద ప్రపంచం ఉందని,
తల వాల్చితే నీడలు కనిపిస్తాయని,
ఎత్తితే చెట్లు నీతో నివసిస్తున్నాయని,
వాటిపై పక్షులు వాలుతూ, ఎగురుతూ, 
దూరాలకి మాయమవుతున్నాయని

వాటిపై గగనంలో ఎండ అనేదొకటి 
పగలంతా చాప పరిచి నిద్రపోతుందని,
అది చాప చుట్టాక నల్లని నేల ఒకటి
చుక్కలతో శుభ్రంగా తళతళ్లాడుతుందని

నీ అయిదారుడుగుల ఎత్తు జీవితం నుండి
క్రిందికో, పైకో చూసినపుడు తప్ప తెలీదు

నువు బ్రతకాల్సిన జీవితంలో
నూరో వంతైనా బ్రతకటం లేదని,
నీ విశాలమైన గదిలో ఒక మూలన కూర్చొని 
ఊపిరి ఆడడం లేదంటున్నావని

తరాలుగా ఊడలు దించిన
భయాలు, మొరటుదనాలు
నీ జీవితం నీది కాకుండా చేసాయని

నీ అంతట నువు అడవిలోనో,
నక్షత్రాల గుంపుల్లోనో తప్పిపోతే తప్ప తెలీదు
వానలోకో, ఎడారిలోకో 
నిన్ను విడిచిపెట్టుకొంటే తప్ప తెలీదు

బివివి ప్రసాద్
ప్రచురణ : కవితా సెప్టెంబర్ 2025




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి