24 సెప్టెంబర్ 2025

కవిత : ఉద్వేగాల నుండి

ఉద్వేగాలు అడవిలో వృక్షాలు,
వృక్షాలలోంచి జారే కిరణాలు,
కిరణాలలో మిలమిలలాడే సెలయేళ్ళు,
సెలయేళ్లలో దప్పిక తీర్చుకునే 
కీటకాలు, మృగాలు, పక్షులు

ఎప్పుడూ ఏదో ఒకటిగా ఉండాలనిపిస్తుంది
వృక్షంలానో, కిరణంలానో, సెలయేటిలానో,
కీటకంలానో, మృగంలానో, పక్షిలానో

అడవిలోని ఏదో ఒకటై ఉన్నపుడు
అడవివి అయినట్టుంటుంది,
నువు ఎన్నో అయినట్లూ, నీకు ఎన్నో ఉన్నట్లూ 
కానీ, ఇది ఎప్పటికీ నిండదు
ఎప్పటికీ ఒకలా ఉండదు, ఎప్పటికీ నిలవదు

చెట్లు ఎండుతాయి, చీకట్లు వాలుతాయి
సెలయేళ్ళు పొడిబారతాయి, జీవాలు వెళ్ళిపోతాయి 
ఏదీ మిగలని విషాదం భయపెడుతుంది,
భయపడీ, భయపడీ 
ఇక పడలేక అడవిని వదిలేస్తావు చూడు

అప్పుడు మెలకువ వస్తుంది,
నువు అడవివి కావని, కాలేవని,
అడవిలో తిరుగాడే నిశ్శబ్దానివని,
అడవినీ, నిశ్శబ్దాన్నీ అలముకొన్న ఆకాశానివని,
ఆకాశాన్ని ప్రశాంతంగా కలగనే అనంతానివని

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి