18 సెప్టెంబర్ 2025

కవిత : దుఃఖం తర్వాత

దుఃఖపు తుపాను వెళ్ళిపోయాక
పగటికాంతిని మరింత ప్రేమిస్తావు,
పిల్లల నవ్వులకి లోతైన అర్థం తోస్తుంది,
జీవులకి, జీవితమంటే
ఎందుకింత మోహమో అర్థమైనట్లుంటుంది

పూలు వికసించటం, గాలితెరలు ఎగరటం,
నీరు సరళంగా ప్రవహిస్తూ సంభాషించటం,
పిట్టలూ, ఇంద్రధనువులూ గాలిలో ఈదటం,
నేలమీది జీవులు తీరికగా ధ్వనులు చేయటం, 
వాటికి అర్థాలుండటం కొత్తగా ఉంటుంది,
నీరెండలోకి లోకం మొదటిసారి తెరచుకొన్నట్లుంటుంది
 
దుఃఖం తర్వాత, వ్యక్తి ధూళి అయిన తర్వాత,
నీటికడవలా భళ్ళున విడిన తర్వాత,
భద్రవలయాలు మసకబారిన తర్వాత,
నింగీ, నేలా కంపించిన తర్వాత

నీకు నువు కొత్తగా పరిచయమౌతావు
తలారా స్నానం చేసినట్లు, కొత్త బట్టలు కట్టినట్లు,
పండుగపూట గడుపుతున్నట్లు
నీపై లాలస వంటిదేదో కలుగుతుంది

గాఢమైన దుఃఖం తర్వాత మళ్ళీ పుడతావు,
లోపలి జీవితేచ్ఛ నిన్ను మళ్ళీ ప్రసవిస్తుంది,
గతం బీటల్లోంచి చిమ్మే జీవధార అనుభవానికొస్తుంది,
భవిత తెగిన గాలిపటమై స్వేచ్ఛలోకి ఊపిరితీస్తావు

గాఢమైన దుఃఖం తర్వాత
భయం నుండి ప్రేమలోకి 
ఉలికిపాటున మెలకువొస్తుంది 

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి