03 డిసెంబర్ 2014

అక్షరాశ్రమం

సముద్రంపై ఎగిరి ఎగిరి మళ్ళీ నౌకపైనే వాలిన పక్షిలా
లోకమంతా తిరిగి మళ్ళీ అక్షరాలపై వాలతావు
నీ కెంతమేలు చేస్తున్నాయో ఎపుడూ గమనించలేదు కాని
భూమ్మీద అక్షరాలు మినహా నీకు తోడెవరూ ఉన్నట్టులేరు

దు:ఖంలోకీ, వెలితిలోకీ ఘనీభవించినపుడు
ఏ శూన్యం నుండో పుట్టుకొచ్చిన కిరణాల్లా అక్షరాలు
నీ ఉద్విగ్న హృదయాన్ని చేరి మెల్లగా నిన్ను కరిగిస్తాయి

ఇంత దయా, శాంతీ నీ అక్షరాలకెలా సాధ్యమని
మిత్రులు విస్మయపడుతున్నపుడు ఆలోచించలేదు కాని
వాటిని ఆశ్రయించే క్షణాల్లో ఏదో దివ్యత్వం
నీ దు:ఖాన్ని దయగా, వెలితిని శాంతిగా పరిపక్వం చేస్తున్నట్లుంది

ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క అద్దంలా కనిపిస్తోంది
అద్దాలని అతికినప్పుడల్లా
నీలోపల ముక్కలైనదేదో అతుక్కొన్న ఊరట కలుగుతోంది

ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క నక్షత్రంలా కనిపిస్తోంది
కాసిని నక్షత్రాలని పోగేసుకొన్న ప్రతిసారీ
పిపీలికంలా మసలే నువ్వు పాలపుంత వవుతున్నట్లుంది

ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ ఓ కన్నీటి బిందువవుతోంది
కాసిని కన్నీళ్ళని జారవిడిచిన ప్రతిసారీ
గర్వమో, స్వార్ధమో, మరొక  చీకటో కరిగి

మామూలు మనిషి దేవుడవుతున్నట్లుంది
జీవితం ప్రార్ధనా గీతమవుతున్నట్లుంది
ఎన్నటికీ మరణించనిదేదో లోలోపల వెలుగుతున్నట్లుంది

________________________
ప్రచురణ: తెలుగువెలుగు డిసెంబర్ 14 

02 డిసెంబర్ 2014

పునరుత్థానం


ఒక గాయం ఎటూ కదలనివ్వక
నిలబడినచోటనే కూలబడేలా చేస్తుంది
చూస్తున్న దిక్కులోని శూన్యంలోకి
వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపొమ్మంటుంది 

గాయం ఏమీ చెయ్యదు 
అప్పటివరకూ అల్లుకొన్న తెలిసీ, తెలియని స్వప్నాలనీ 
స్వప్నాలకి సుతారంగా పూయబోతున్న సంతోషాల పువ్వులనీ
చిందరవందర చేయడం మినహా
పాలుగారే వెన్నెలల్నుండీ, ఉభయసంధ్యల వర్ణాలనుండీ
సేకరించుకొన్న జీవనలాలసని ఒకేసారి చెరిపేయడం మినహా

ఇన్నాళ్ళూ పాడింది పాటే కాదు, మళ్ళీ మొదలుపెట్టు
భూగోళమంత జీవితాన్ని నీపై మోపుతున్నాను,
ఇప్పుడు ఆకాశంలా ఎగిరిచూపించు అంటుంది గాయం

2
జీవితోత్సవాన్నుండి వేరుపడ్డ హృదయం
తడిసి మెరిసే మాటకోసం, చూపుకోసం, స్పర్శకోసం
తప్పిపోయిన పిల్లాడిలా ఎడతెగక ఎదురుచూస్తుంది

దారులన్నీ మూసుకుపోతున్న చీకట్నుంచి చీకట్లోకి
దుఃఖజలంతో బరువెక్కుతున్న కాలంనుంచి కాలంలోకి
ఉన్నచోటనే వేళ్ళూనుకొంటున్న గాయంతో వేచివుంటుంది

3
దైవీశక్తులేవో దీవించిన స్పటికంలాంటి క్షణమొకటి ప్రవేశిస్తుంది
ఉన్నట్లుండి ఒకనిట్టూర్పు గుబురుకొమ్మల్లోంచి పక్షిలా ఎగురుతుంది
కాసిని కన్నీటిమొగ్గలు చెక్కిళ్ళపై పారాడుతాయి

ఎక్కడిదో నీళ్లచప్పుడూ, పక్షిరెక్కల అలికిడీ
చెట్ల ఆకుల్ని గాలి మృదువుగా నిమిరిన మర్మరధ్వనీ
చెవిలో జాగ్రత్తగా గుసగుసలాడుతాయి

జీవితం చాలా పెద్దది, చాలా దయగలది కూడా
ఊరికే నిలబడు, ఒక అడుగువేయి
తక్కినదంతా తను చూసుకొంటుంది

లేతమొక్కలా కూలిపోయిన నీవు
నిలబడతావు, నిలబడతావు
ఒక మహావృక్షపు ఛాయను నీ వెనుక చిత్రించుకొంటూ

మేఘాలు నుదుటిని చుంబించేవరకూ నిలబడుతూనే ఉంటావు

______________________
ప్రచురణ: ఈమాట నవంబర్ 2014

27 నవంబర్ 2014

ఎవరెవరు..

ఎవరెవరు వెళ్లిపోదలచారో వెళ్లనివ్వు నీ జీవితంలోంచి
వెళ్ళిపోవటాలు చూడటానికే నువ్వొస్తావు

ఒకానొక కాలం నిన్నొక వాకిలి చేసి నిలబెడుతుంది
ఎవరెవరో పని ఉన్నట్టే నిన్ను దాటి
హృదయంలోకి వస్తారు, నీలో వెదుకుతారు
వాళ్ళు నీ వాళ్ళని అనుకొంటూ ఉండగానే
ఇక్కడేమీ లేదు, అంతా ఖాళీ అని
గొణుగుతూ వడివడిగా వెళ్ళిపోతారు

నిజమే, ఖాళీలలో ప్రవేశించే ఖాళీలు
ఖాళీలలోంచి బయటికి నడిచే ఖాళీలు
ఖాళీ అనుభవాలతో లోపలి ఖాళీ నింపుకోవాలనే వెర్రివ్యాపకమొకటి
వేసవికాలపు వేడిగాలిలా సుడితిరగటం మినహా, నిజానికి ఇక్కడేమీ లేదు

వెళ్ళనీ ఎవరు వెళతారో, త్వరగా, మరింత త్వరగా
ఎగరబోతున్న పక్షిరెక్కల్లోంచి జారిపోతున్న తూలికలా
అరచేతుల్లో వాలి మాయమైపోతున్న ఉదయకిరణంలా
మేలుకోగానే తెలియరాని మైదానంలోకి రాలిపోయిన కలలా

ఓ దీర్ఘశ్వాస తీసుకొని, హాయిగా విడిచేయి శ్వాసనీ, మనుషుల్నీ
స్వప్నసరోవరంలోకి హంసల్ని విడిచినట్లు సుతారంగా, తేలికగా..

_________________
ప్రచురణ: కినిగే 13.10.14

13 నవంబర్ 2014

'ఆకాశం' కవితాసంపుటిపై గరికిపాటి నరసింహారావుగారు

'ఆకాశం' సంపుటి గురించి గరికిపాటి నరసింహారావుగారు ఇటీవల రాసిన ఉత్తరం, మొన్న 11 వతేదీన భక్తి టీవీలో చెప్పిన మాటలు ఆసక్తి ఉన్న మిత్రులు ఇక్కడ చూడగలరు. 

భాగ్యనగరం,
17-10-2014 

ఆకాశం కొలవడం అసాధ్యం. చదవడం సాధ్యమే కానీ చాలాకాలం పడుతుంది. అందుకే ఇంతకాలం పట్టింది.

నేను ఏ పుస్తకం చదివినా నచ్చిన వాక్యాలకు V గుర్తు పెట్టుకుంటూ ఉంటాను. మొత్తం కవిత అంతా ప్రత్యక్షరం బాగా నచ్చితే దాని శీర్షికకే V గుర్తు పెట్టేస్తాను. అలాంటివి ఆకాశంలో చాలా నక్షత్రాలున్నాయి. ఇంటిబెంగ, అంతరాత్మవంటివాడు, చాలు, మనలో ఒకడు, సంపాదన, కలుసుకోవాలి, చివరచూసినవాడు, గోడ, మొదటిప్రశ్న, నేను ఉన్నాను, సున్నితంగా, కవిత్వం, చివరిమాటలా, పంజరాలు, కవీ-మేఘమూ, బ్రతుకుపాట, బహిరంతరాలు - ఇవన్నీ అంతబాగా నచ్చేసినవే. 'చాలు ' అనే కవిత అయితే దానికే విసుగొచ్చేన్నిసార్లు చదువుకొన్నాను.

'మనం చిన్నచిన్న ఆకాశాల' మనడంలో జీవ లక్షణం బాగా చెప్పారు. ఆకాశంలోకి చూడటమంటే అమ్మ ముఖంలోకి చూడటమనే అభివ్యక్తి చాలాబాగుంది. 'ఇంటిబెంగ ' లో 'న జీవ బ్రహ్మణోర్భేద: ' అనే తత్త్వం సున్నితంగా వ్యక్తమయింది. అలలులేని కొలనే పాలసముద్రం. ఆలోచనలే అలలు. పాలసముద్రంలో విష్ణువు ఉంటాడంటే అర్థం ఆలోచనల్లేకపోవడమే దైవదర్శనం అని. ఈ తత్త్వం అంతా 'కొలను ' లో సూక్ష్మంలో మోక్షంలా చెప్పారు. 26-2-11 నాటికి 3-3-11 నాటికి మీ అవగాహన ఎంత విస్తృతమైందో 'ముక్తికాంక్ష ' ద్వారా తెలుస్తోంది. కవితలకు తేదీలు వెయ్యడంలో కొన్ని ప్రయోజనాలుంటాయన్నమాట. 

చినుకుతో పోరాడిన జీవి చందమామలా బయటకు రావడం స్వాతిముత్యం స్థాయికి తగిన ఉపమానం. లోకానికి గెలుపుజ్వరం తగిలిందనడం పచ్చినిజానికి పండిన అభివ్యక్తి. 'పనిచేయకపోవడమే సరైన పని ' అనేది చూడగానే 'న కుర్యాత్ న విజానీయాత్ ' అనే శంకరాచార్య వేదాంతడిండిమం గుర్తువచ్చింది. 'అలవాటు మహా మాయ ' అనడం గాఢతాత్త్వికభావన. అపురూపమైన మనిషివర్ణనలో ప్రతివాక్యం అపురూపమే. 'గదిలో వాలిన కిరణాలు పనిమీద వీధిలోకి ' వెళ్ళడం ఎంతబాగుందో! మీరన్నట్లు నిశ్శబ్దాన్ని మోసుకొస్తే ధ్యానం కుదిరినట్లే. 'మనలో ఒకడు ' అసూయకు మంచిమందు. స్త్రీ పురుషాకర్షణ పెళ్ళికి ముందు పూవుతుమ్మెదలాంటిదై, పెళ్ళయ్యాక దీపం శలభం లాంటిది కావడం చూస్తూనే ఉన్నాం.

మరింత పేరు, మరింత డబ్బూ ఉంటే జీవనానందం సమాధి అయిపోయినట్లేనని అద్భుతంగా చెప్పారు.

'మనల్ని మనమే శ్రద్ధగా జాగ్రత్తగా బంధించుకుంటాం ' అనేమాట భాగవతంలోని 'త్యజేత కోశస్కృది వేహమాన: కర్మాణి లోభా దవితృప్తకామ: ' అనే వ్యాసవాక్యాన్ని గుర్తుచేసింది. 'వస్తాము ' అనే ఖండికలో జన్మ ఎత్తడంలో ఉండే తత్త్వమంతా ఉంది. 'కలుసుకోవాలి ' అనే కవిత ప్రపంచానికి మార్గదర్శి. 'చివరచూసినవాడు ' కవిత మనిషిలోని అపరిపూర్ణతను ఆవిష్కరించింది.

'వాడి ఆటకు మనం ఆటంకం కాకపోతే చాలు ' అనే మాట 'ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు: ' అనే మనీషాపంచక వాక్యాన్ని గుర్తుచేసింది. 'ప్రపంచం ఒక గోడ ' అనే 3 పంక్తుల్ని ఇప్పటికే మూడు నాలుగు సభల్లోనూ, టీవీలోను మీ పేరుచెప్పి మరీ చెప్పాను.

నేనెవరు అని ప్రశ్నించుకోడానికి అంతా విరామసమయమే అయిపోతే ఎంతబాగుండును! 'నేనున్నాను ' కవిత దానికదే ఒక ఉపనిషత్తు.

మొత్తం మీద మీ 'ఆకాశం ' లో 'ఉన్నదంతా దైవమే. జీవితమే దైవం. ' ఎంతరాస్తే న్యాయం జరుగుతుంది. దాచుకొని మళ్ళీమళ్ళీ చదువుకోవలసిన కవితాసంపుటి అందించారు. ఆజన్మాంతం కృతజ్ఞుణ్ణి. 

గరికిపాటి నరసింహారావు 

భక్తి టీవీలోని ప్రసంగభాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వారి సహృదయానికి అనేక నమస్సులు తెలియచేస్తున్నాను.







26 అక్టోబర్ 2014

ప్రేమా, ఆకర్షణా..

ప్రేమకీ, ఆకర్షణ కీ భేదమేమిటని చూస్తుంటే చాలానే ఉందనిపించింది. ప్రేమా, ఆకర్షణా (లేదా మోహం), వాంఛా ఈ మూడిటికీ ఉన్న భేదాలు సూక్ష్మమైనవి, కానీ, వాటి ఫలితాలు చాలా భేదం.
ఒకప్పుడు ప్రేమకీ, ఆకర్షణకీ నేను గమనించిన యాభై భేదాలని ఇక్కడ పంచుకొంటున్నాను. వీటిలో కొంత పునరుక్తీ, కొన్ని విస్మరించినవీ ఉండవచ్చును.
ఆసక్తి ఉన్నవాళ్ళు చదవండి.

1 పవిత్రస్థలంలో ప్రవేశించడం ప్రేమ, అడవిలో దారితప్పటం ఆకర్షణ
2 ప్రియమైనవ్యక్తిని లోకమంతా దర్శించటం ప్రేమ, లోకానికి అంధులు కావటం ఆకర్షణ
3 నిజమైన ప్రేమ వియోగం ఎరుగదు, ఆకర్షణకి నిజమైన కలయిక తెలియదు
4 ప్రేమంటే సముద్రమంత అవగాహన, ఆకర్షణ వెల్లువలాంటి ఉద్వేగం
5 ప్రేమ నిశ్శబ్దంద్వారా ఎన్నో చెబుతుంది, ఆకర్షణ మాటల వెనుక ఎన్నో దాస్తుంది

6 ప్రేమ శక్తినిస్తుంది, ఆకర్షణ బలహీనపరుస్తుంది
7 ప్రేమ ఎదిగేలా చేస్తుంది, ఆకర్షణ పతనం చేస్తుంది
8 ప్రేమ వికసింపచేస్తుంది, ఆకర్షణ ముకుళింపచేస్తుంది
9 ప్రేమ ప్రార్ధిస్తుంది, ఆకర్షణ బలప్రదర్శన చేస్తుంది
10 ప్రేమ చెదరని శాంతి, ఆకర్షణ ముగియని యుద్ధం

11 ప్రేమకి ఇవ్వటం తెలుసు, ఆకర్షణకి తీసుకోవటం తెలుసు
12 ప్రేమ రెండోవారి సంతోషం కోరుతుంది, ఆకర్షణ తన సంతోషం కోరుతుంది
13 ప్రేమ స్వార్ధం నుండి విముక్తినిస్తుంది, ఆకర్షణ స్వార్ధం పెంచుతుంది
14 ప్రేమ స్వేచ్చనిస్తుంది, ఆకర్షణ బంధిస్తుంది
15 ప్రేమ ఎప్పుడూ నమ్ముతుంది, ఆకర్షణ ఎప్పుడూ సందేహిస్తుంది

16 ప్రేమలో దయ, వివేకం వికసిస్తాయి, ఆకర్షణలో కాఠిన్యం, కపటం బలపడతాయి
17 ప్రేమ పసిదనంలోని అమాయకత్వం వంటిది, ఆకర్షణ పసిదనంలోని మొండితనం వంటిది
18 ప్రేమ రెండవవారిలో తనని గుర్తిస్తుంది, ఆకర్షణ రెండవవారినుండి ఎప్పుడూ వేరుచేస్తుంది
19 ప్రేమ ఆకర్షణని సృష్టించగలదు, ఆకర్షణ ప్రేమని సృష్టించలేదు
20 ప్రేమ ఆకర్షణగా కనబడటానికి బిడియపడుతుంది, ఆకర్షణ ప్రేమగా కనబడటానికి తొందరపడుతుంది

21 ప్రేమ సహానుభూతి, ఆకర్షణ వ్యామోహం
22 ప్రేమ తెల్లనిది, అన్నిరంగుల్లోంచీ తనని ప్రకటిస్తుంది; ఆకర్షణ నల్లనిది, అన్నిరంగుల వెనుకా తనని దాస్తుంది
23 ప్రేమ సున్నితమైన అనుభూతి, ఆకర్షణ బలమైన ఉద్వేగం
24 ప్రేమ హృదయభాష, ఆకర్షణ దేహభాష
25 ప్రేమ ఉన్నచోట సౌకర్యంగా అనిపిస్తుంది, ఆకర్షణ అలజడి కలిగిస్తుంది

26 ప్రేమ నీ నిజస్వరూపం, ఆకర్షణ నీ కల్పితవ్యక్తిత్వం
27 ప్రేమ స్పష్టతనిస్తుంది, ఆకర్షణ అయోమయం సృష్టిస్తుంది
28 ప్రేమ వినమ్రతవైపు నడిపిస్తుంది, ఆకర్షణ గర్వానికి దారితీస్తుంది
29 ప్రేమ తనని మాత్రమే ఇస్తుంది, ఆకర్షణ ప్రేమని తప్ప అన్నిటినీ ఇస్తుంది
30 ప్రేమ నిండుదనాన్నిస్తుంది, ఆకర్షణ వెలితిని సృష్టిస్తుంది

31 ప్రేమ ధ్యానం వంటిది, ఆకర్షణ చెదిరిపోవటం లాంటిది
32 ప్రేమ స్వస్థతనిస్తుంది, ఆకర్షణ గాయపరుస్తుంది
33 ప్రేమ ప్రశాంతం, ఆకర్షణ ఉత్కంఠ
34 ప్రేమలో స్ఫురణ మేలుకొంటుంది, ఆకర్షణలో కాంక్ష మేలుకొంటుంది
35 ప్రేమ పరిపక్వత నిస్తుంది, ఆకర్షణ మూర్ఖుల్ని చేస్తుంది

36 ప్రేమ నువ్వుంటే చాలు సంతోషిస్తుంది, ఆకర్షణ నువ్వేమైనా ఇస్తే సంతోషిస్తుంది
37 ప్రేమ కృతజ్ఞత కలిగివుంటుంది, ఆకర్షణ కృతఘ్నతకి దారితీస్తుంది
38 ప్రేమ నిన్ను తేలికగా, కాంతిగా మార్చుతుంది, ఆకర్షణ న్యూనతలోకీ, చీకటిలోకీ నడిపిస్తుంది
39 ప్రేమ ఎప్పటికీ ప్రేమాస్పదంగానే ఉండిపోతుంది, ఆకర్షణ కాలంతో కరిగిపోతుంది
40 ప్రేమ నిర్మలాకాశంలోని చంద్రునివంటిది, ఆకర్షణ కొలనులోని అలలతో చెదిరిపోయే చంద్రబింబం వంటిది

41 ప్రేమ అంటుంది నన్ను నీలో కనుగొన్నాను, ఆకర్షణ చెబుతూ ఉంటుంది నువ్వింకా దూరంగానే వున్నావు
42 ప్రేమ నువ్వు సరిగా ఉన్నావనటానికి త్వరపడుతుంది, ఆకర్షణ సరిగా లేవనటానికి త్వరపడుతుంది
43 ప్రేమ చీకటి నుండి వెలుతురులోకి ప్రయాణం వంటిది, మొదట అది నెమ్మదిగా సమీపించినా కూడా;
     ఆకర్షణ వెలుతురు నుండి చీకట్లోకి ప్రయాణం వంటిది, మొదట అది వేగంగా తాకినా కూడా
44 ప్రేమ మానవత్వం నుండి దైవత్వానికి నడిపిస్తుంది, ఆకర్షణ మానవత్వం నుండి పశుత్వానికి దారితీస్తుంది
45 ప్రేమ 'మనం కలవకముందే ఒకరికొకరం తెలు’ సంటుంది,
     ఆకర్షణ 'ఇన్నాళ్ళు కలిసివున్నా ఒకరినొకరం తెలుసుకోలేకపోయా’ మంటుంది

46 ప్రేమ సముద్రగర్భంలోని నిలకడ లాంటిది, ఆకర్షణ పైపై చలించే అలలవంటిది
47 ప్రేమ మహావృక్షపువేరులా లోతైనది, ఆకర్షణ కొమ్మలమీది ఆకుల్లాంటిది
48 ప్రేమ పర్వతంలా నిశ్చలం, ఆకర్షణ కదిలిపోయే మేఘం
49 ప్రేమ ఆకాశంలా ఎప్పుడూ హత్తుకొని వుంటుంది, ఆకర్షణ అగ్నిలా దహిస్తూవుంటుంది
50 ప్రేమ నీ నిజమైన ఉనికిలా బలమైనది, ఆకర్షణ నీ ఊహలా దుర్బలమైనది

08 అక్టోబర్ 2014

మనుషుల్ని చూడగానే..

మనుషుల్ని చూడగానే వారి కళ్ళల్లో
కొలనులో చలించే ప్రతిబింబాల్లాంటి కలలు కనిపిస్తాయి
కలల వెనకాల ఉండీలేనట్లు మెరుస్తూ  
జీవితం తనపట్ల తాను చూపే లాలస కనిపిస్తుంది 

వారిని తాకబోయినపుడల్లా
వాళ్ళ వ్యక్తిత్వాలని పట్టించుకోకుండా
వాటి లోపల వెలుగుతున్న జీవనసౌందర్యాన్ని చూస్తావు 

‘ఏమిటలా చూస్తున్నావు ఆశ్చర్యంగా’ అని  
వారు అన్నపుడల్లా
‘మన జీవితాలన్నీ ఒకే జీవితమై కనిపిస్తోంది
మీరూ ఇలా చూడగలిగితే ఎంత బావుండున’ని జవాబిస్తావు

విత్తనాన్ని నీ అరచేతులలోకి తీసుకొన్నపుడే
దాని చిటారుకొమ్మన వికసించే పూలపై తేలే పరిమళాలు
చిరుగాలితో చెప్పబోయే కబుర్లు నీకు వినిపిస్తాయి సరే కాని

కాస్త ఆగు, కాలాన్ని ప్రవహించనీ
ప్రతి అలనూ తానుగా సముద్రంలోకి మేలుకోనీ
ప్రతి జీవితాన్నీ ఏకైక మహాస్పందనలో కరగనీ అని
నీకు నువ్వు బోధించుకొంటూనే వుంటావు కదూ 

___________________________