13 ఆగస్టు 2025

కవిత : ఉండాలి..

ఉండగా ప్రేమించటానికి లెక్కలు వేస్తాం
వెళ్ళిపోయాక చెల్లా చెదురవుతాయి,
మనుషుల కన్నా బుద్ధిహీనం ఉంటాయా,
కాస్త ప్రేమిస్తే చాలు 
ఉదయాలు తాకినట్టు బ్రతుకుతారు వాళ్ళు 
ఒకరికొకరమని సంతోషపడుతూ

ఏ పగలు ఒకరు రాలిపోతారో తెలీదు,
ఏ రాత్రి ఒంటరితనాన్ని మిగిల్చివెళతారో,
బ్రతికున్నాం కదా, ప్రేమించుకుందామని
ధైర్యం చెప్పుకునే తెలివొస్తుందా ఏనాటికైనా
బ్రతికివెళ్లారు కదా ప్రేమించుదామనే రోజులొస్తాయా 

మనుషుల కన్నా అమాయకం ఉన్నాయా,
కాలాలకి తమవారిని బలి ఇచ్చే 
తెలివిలేని జీవులు ఉంటాయా,
లేవగానే, నువు ఉన్నావు చాలనే 
భరోసాతో ఒకరికొకరు ఉండటం కన్నా,
ఈ ఒంటరిలోకం ఎవరి నుండి ఏమాశిస్తుంది
కొంచెం ప్రేమ కోసం కదా, ఇదంతా ఇలా పుట్టింది

నవ్వుతావో, ఏడుస్తావో నీ స్వేచ్ఛ,
ఇక్కడ ఉండు నీకు నచ్చినట్టు,
నాకు దగ్గరగానో, దూరంగానో,
నువు ఉన్నావన్న స్పృహ చాలు,
నేను నిండుగా ఉండటానికి అని
ఎవరితోనైనా, ఎప్పుడైనా అనగలుగుతామా

బివివి ప్రసాద్

12 ఆగస్టు 2025

కవిత : కలలాంటి బంధాలు

కలవటం ఎంతసేపు, విడిపోవటం ఎంతసేపు
చిటికె వేసినట్టు కలవొచ్చు,
పూలు రాలినట్టు విడిపోవచ్చు,
విడిపోవటం భారమా, తేలిక పడటమా

నిజాయితీ కదా వెలగాల్సింది 
బంధంలో, విడివడటంలో,
కలిసి ఉండటమా ముఖ్యం
ఒకరుగా నిండుగా ఉండటం కదా

కాలమింకా చాలా మారాలి
మనం ఎదగాలి, పండాలి,
మరింత కాంతిలోకి వికసించాలి

బ్రతికి ఉండటం కన్నా 
ఏదీ విలువ కాదని తెలియాలి,
తనతో తానుండటం కన్నా 
అపురూప బంధమేదీ లేదని కూడా

మనుషులతో, విలువలతో కాదు
ఊరికే కలిసి ఉండాలి జీవించటంతో

చెట్లు జీవిస్తున్నాయి నీతో కలిసి
నీరు జీవిస్తోంది, గాలి జీవిస్తోంది,
ఆకాశం జీవిస్తోంది, కాలం జీవిస్తోంది

నీవు కలిసిన వారిలోంచి,
విడివడిన వారిలోంచి,
జీవితం తనని తాను జీవిస్తోంది,
కలలాగా నిన్ను తాకుతోంది

బివివి ప్రసాద్

11 ఆగస్టు 2025

కవిత : వీడ్కోలు ప్రేమలేఖ

అమాయకపు స్వర్గం నుండి
జారిపోతున్నా హాయిగానే వుంటుంది

ఆ హాయి లౌక్యానిది కాదు,
అమాయకత్వానిది,
ఈ సంగతి లౌకిక పాతాళంలో 
చిక్కుకున్నాక కానీ తెలిసిరాదు

ఏం ఉపయోగం,
అప్పటికే ఈ లోకపు డొల్లలలో 
ఒకటిగా మిగులుతాము, 
అమాయకమైన కాలం
మనని చూసుకుని దుఃఖపడుతుంది

బివివి ప్రసాద్

10 ఆగస్టు 2025

కవిత : క్షణికం

 1
ఇవాళ ఉన్న ప్రేమ రేపు ఉండకపోవచ్చు,
నిన్నటి కోపం ఇవాళ మిగలనట్లే
జీవితం క్షణమాత్రం కదా, ఇక ఉద్వేగాలెంత 

ఈ క్షణంలోకి నిన్ను కోల్పోవటంలో దాగివుంది
జీవితంలోని అందమంతా,
కొనసాగించాలనిపిస్తుంది చూడూ
అప్పుడు మొదలవుంది జీవనవిషాదం

ఇంద్రధనువు వెళ్ళిపోయాక గగనం వెలిసిపోదు
తనతోనే నిండి వుంటుంది హాయిగా, 
నింగిలో నుండి వచ్చావు కదా
ఉండలేవా చూడు నీతో నిండిపోయి

2
ఏకాంతం జీవన రహస్యం
ఎవరూ లేనప్పుడు, ఏ చప్పుడూ కానప్పుడు,
అద్దంలోని మనిషి ఒకడే ఎదురైనపుడు
ప్రేమించు తనని కూడా,
ఎదురుచూపుల వేదనంతా ఆవిరైపోయి 
తేలికైనకాంతి చొరబడుతుంది లోపలికి

నిన్ను నువు ప్రేమించాలి, క్షమించాలి, 
హృదయానికి దగ్గరగా తీసుకోవాలి,
ఉనికి నిన్ను ప్రార్థించేది ఈ లాలన కోసమే, 
మిగిలిన ప్రపంచం బ్రతిమాలినా నీతో ఉండదు,
దాని పని దానికి ఉంది

ఒంటరితనం శాపం కాదు, వరం
ఇది అర్థమైతే లోకం అందంలోకి మారుతుంది

3
జీవితాన్ని నిజంగా ప్రేమించిన వాళ్ళు
తమ ముద్రలు ఇక్కడ మిగలాలనుకోరు
రేపటి కాంతి కోసం తమ రాత్రిని ఖాళీ చేస్తారు
ఏమి మిగలాలి ఇక్కడ, ఎంతకాలం

నువు ఏడవలేదు, నవ్వలేదు
నీలోంచి ఎవరో వాటిని చూసారు, చూపించారు
నువు ఉండేది లేదు, వారు వెళ్ళేది లేదు

ఇంత అద్భుతమైన లోకం
ఒక్క మృత్యువుతో మాయమవుతుంది
తరువాత మిగిలేది ఏమిటి! ఎవరికి!

బివివి ప్రసాద్