31 ఆగస్టు 2025

కవిత : కానిమ్మని..

మళ్ళీ మేలుకొంటావు,
ఈ కాంతీ, అలల్లా ఎగిసే రంగులూ, నీడలూ, 
వాటిలోంచి దాగుడుమూతలాడే 
జీవితమూ పలకరిస్తాయి
ఈ రోజైనా ప్రేమించగలవా మమ్మల్ని

ప్రతి మెలకువలోనూ జీవితం ఇదే చేస్తుంది,
ప్రతి నిద్రకి ముందూ ఇదే చెబుతావు
సంతోషం, ఇక చాలు, విడిచిపెట్టు అని

నిజంగా, ఈ లోకం అందమైనది,
దీని కాంతినృత్యం సంభ్రమాశ్చర్యాలనిస్తుంది
కానీ, ఇంత వినోదం, 
సముద్రపు లోతుల్లోని 
గాఢమైన ఏకాంతాన్నీ, నిశ్శబ్దాన్నీ ఇవ్వలేదు

ఇక్కడ తిరిగావు, నవ్వావు,
గుండెలవిసేలా ఏడ్చావు కొన్నిసార్లు,
చాలా భయపడ్డావు అనేకమార్లు
ఇవన్నీ అవసరమా
ఖాళీ ఆకాశంలాంటి స్వేచ్చలోకి ఎగిరిపోకని
కలగన్నావు, దిగులు పడ్డావు

అయినా ప్రపంచం పిలుస్తుంది,
అమ్మ పిలిస్తే పరుగున వచ్చినట్టు
తటాలున దీనిలోకి మేలుకొంటావు 

పక్షి కూత గాలిలో కలిసిపోతుంది,
వికసించిన పూవు భూమిలో కరిగిపోతుంది,
ఎగసిపడే అల సముద్రంలో మాయమౌతుంది, 
ఆట ముగిశాక ఖాళీ తలుపు తట్టితీరుతుంది 

సరే, ఇవాళ్టికి కానిమ్మని
ప్రపంచంలోకి అడుగుపెడతావు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి