28 ఆగస్టు 2025

కవిత : ఆకాశం వైపు

చీకాకుల మునుగీతలోంచి
అప్రయత్నంగా తలయెత్తి 
సాయంకాలపు ఆకాశాన్ని చూసావు

అమ్మమ్మ ఒడిలోంచి
ఆశ్చర్యంగా కన్నార్పక చూసిన ఆకాశాన్ని,
ఆరుబయట చాపలపై కథలు చెప్పుకుంటూ
కనులు మూసే ముందు తలనిమిరిన ఆకాశాన్ని,
ఆటల్లో కింద పడినపుడు 
హఠాత్తుగా విశాలమైన ఆకాశాన్ని,

ఆమె మౌనానికి అర్థం తెలియక 
దిగులుగా కనులప్పగించినపుడు 
కరుణతో కౌగలించుకున్న ఆకాశాన్ని,
మిత్రుడి సాయంతో జీవితం లోతుల్ని 
పట్టుకోవాలని చూసే మాటల మధ్య 
మౌనంగా దర్శనమిచ్చిన ఆకాశాన్ని

చీకాకులెటూ పోవు
బలహీనతల్ని గిల్లుతూ వుంటాయి,
లేదా, బేలగా నీ వంక చూస్తుంటాయి,
భయాలు ఊది మంట రాజేస్తూ వుంటాయి,
తప్పించుకునే దారికోసం వెదకమంటాయి 

కానీ, ఆకాశం నిన్నేమీ చేయమనదు 
ఊరికే నిన్ను చూస్తుంది,
నీ చూపుకోసమే చూస్తున్నట్లు, పిలుస్తున్నట్లు,
పోనీ, నేను రానా అని అడుగుతున్నట్లు,
ఎందుకా చీకాకులన్నీ ఇంటికి వచ్చేయి అన్నట్లు
దయగా, తల్లిలా చూస్తుంది

ఇప్పుడిక చీకాకులన్నీ 
దొరికిన నీడల్లో కల్లా కాసేపు మాయమయాక,
నీ ముందు రెండు ప్రశ్నలు నిలుస్తాయి
పట్టుకొంటూ, పట్టుబడటమా, 
విదిలించుకొని, ఎగిరిపోవటమా

మొదటిదే గెలుస్తుందని 
రాసే నీకూ, చదివే మిత్రులకీ చెప్పనక్కరలేదు,
లేదంటే, నువు ఎందుకు రాసేవాడివి,
వారెందుకు చదివేవారు,
ఏనాడో మేఘాలపైకి ఎగిరిపోయేవారు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి