31 ఆగస్టు 2014

ఒక దారి

1
నువ్వు ఇంటిలో వున్నావు 
ఇల్లు నీ ఊరిలో, ఊరు దేశంలో, దేశం భూమ్మీద,
భూమి ఒక పాలపుంతలో, పాలపుంత అనంతంలో

మధ్యలోని గీతల్ని మరిచిపోయి గమనిస్తే
ఎప్పుడూ అనంతంలోనే ఉన్నావని కొత్తగా కనుగొంటావు 

2
నీ దేహాన్ని గూడుగా కట్టుకొని 
లోపల వెలిగే పక్షి అద్బుతమైనది

రెండుకళ్ళ రెక్కల్ని ఎంత చాపగలిగితే 
అంతకు అంతై విస్తరిస్తుందీ పక్షి 

తండ్రీ, నువ్వు చీమని చూస్తున్నపుడు చీమవి
అనంతాన్ని చూస్తున్నపుడు అనంతానివి 

అనంతం తరువాత ఏముందని అడగనవసరంలేదు 
మాట చేరగలిగే ఆ చివరిచోటికి చేరుకొన్నాక 
చూపుకాని చూపులోకి రాలిపోతావు

30 ఆగస్టు 2014

అమ్మమ్మ

1
'అమ్మమ్మా వాన పడుతోంది '
ఆరుబయట పక్కలో పడుకొన్న మనవడు ఉలిక్కిపడినప్పుడు
'పడనీరా చల్లగా ఉంటుంది ' అన్న అమ్మమ్మ మాట
అతని జీవితానికొక చూపునిచ్చింది

వానకి భయపడి ఇంటిలోకి పరుగెట్టనక్కరలేదు 
వానలో తడవటం బావుంటుంది 
దయలాంటి వానకి , ప్రకృతిలోని అందమంతా కరిగి నీరై పడేవానకి
నిన్ను అర్పించుకోవటం బావుంటుంది

మట్టివాసనల్ని మేల్కొలుపుతూ   
నిన్ను ఆర్ద్రతలోకి చల్లగా నడిపించే వానపట్ల,
వానలాంటి జీవితంపట్ల ఉండాల్సింది భయం కాదు, ప్రేమ

2
అమ్మమ్మ దేనినీ ధిక్కరించలేదు
ఎవరినీ ఎప్పుడూ గద్దించగా చూడలేదు

భూమిలాంటి అమ్మమ్మ
అంత ఉమ్మడికుటుంబానికీ కేంద్రమై కూడా
తనని నేపధ్యంలోనే నిలుపుకొంది

తాతయ్య తడినిండిన మేఘగర్జనలకి
ఆమె బెదురుతున్నట్లుండేది కాని
ఆమె బెదిరేమనిషి కాదని తాతయ్యకి తెలుసు
భయం చివర సమస్తజీవితాన్నీ దీవిస్తున్నట్టు విచ్చుకొనే
ఆమె చిరునవ్వు చూసిన మనవడికీ తెలుసు 

3
జలధరంలాంటి ఉమ్మడికుటుంబం క్రమంగా  
తెల్లని మబ్బుతునకలుగా చెదిరిపోయి  
జీవితసహచరుడూ సెలవుతీసుకొన్న చివరిరోజులలో
కూతురు అమ్మయి రుణంతీర్చుకొంటున్నపుడు 

అగాధమైన నిశ్శబ్దం నిండిన చూపులతో
చివరిరోజులోకి భయంలేక ప్రయాణిస్తున్నట్లుండే 
ఆమె జీవస్పందనలని గమనించినప్పుడల్లా

యవ్వనపుతొందరల మధ్యనున్న మనవడు  
అమ్మమ్మ ఏం ఆలోచిస్తుందీ అని విస్మయపడుతూనే ఉండేవాడు

4
ఒక ఉక్కపోసే సాయంత్రంలోకి చేరుకొన్న మబ్బులు 
చినుకుల్లా కరిగి భూమిని నిశ్శబ్దంగా తాకుతుంటే

గదిలోంచి బయటకు వెళుతున్న మనవడితో ఆమె
'ఏమిటది, వానపడుతోందా ' అన్నపుడు
అతను ఊహించలేదు అవి తనతో ఆమె చివరిమాటలని
ఉక్కపోతతో నిండనున్న జీవితంలోంచి చివరి వానాకాలం వెళ్ళిపోనుందని

5
జీవితం అమ్మమ్మలా దయగలదీ, ఓర్పునిండినదీ
కాదని తెలుసుకొంటున్నా
దానిని ప్రేమనిండిన చిరునవ్వుతో ముగించటమెలాగో
ఆమెనీడలో పెరిగిన కూతురుకొడుకు నేర్చుకొంటున్నట్టే ఉన్నాడు  

కనుకనే, దుఃఖపూరిత జీవితానుభవాన్ని
దయగల పదాల్లోకి అనువదిస్తున్నాడుడిసెంబర్

ప్రచురణ: తానా పత్రిక 2014

25 ఆగస్టు 2014

తెరిచినవేళల

ఇంటికిచేరి తలుపులు తెరుస్తున్నపుడు
జీవితమంతా నువ్వు తెరిచినవన్నీ గుర్తుకొస్తాయి

తెరిచిన పుస్తకాలు, స్నేహాలు
తెరిచిన మాటలు, నవ్వులు, కన్నీళ్ళు
తెరిచిన పగళ్ళు, రాత్రులు
భూమ్మీద నీకు నువ్వుగా తెరిచిన నీ జీవితం

ప్రతిదీ తెరిచినపుడల్లా
మరికాస్త పూలరేకుల్లాంటి వెన్నెల
తాజాగా నీలో రాలటం గుర్తిస్తావు

తెరవటంలో సంతోషంవుంది గనుకనే
సృష్టి నిరంతరం తెరుచుకొంటుంది
ఎల్లలులేక జ్ఞానం విస్తరిస్తోంది

కానీ, తెరుచుకొన్నవి
నీ వెనుకనే మూసుకుపోవటం చూసినపుడు
నీడలాంటి విషాదం నీలో పరుచుకొంటుంది

బహుశా, అందుకనే
లోనికి వచ్చి తలుపులు మూసే ప్రతిసారీ
నిలువెత్తు నిస్పృహ నిన్ను కమ్ముకొంటుంది

తెరుచుకొన్న మెలకువ
నిద్రలోకి ముడుచుకొనే ప్రతిసారీ
సదా వికసించేచోటికి యాత్ర మొదలౌతుంది

19 ఆగస్టు 2014

ఆనందంలోకి

ఎవరైనా ఆనందంగా కనిపిస్తే కారణమేమిటని అడగకు
కారణాలకేముంది, భిన్నమైన కోణాల్లో, తలాల్లో వుంటాయి

ఒకటే ఆనందంలోకి ఒక్కసారిగా చొరబడినపుడు
కారణాల సంకెళ్ళని కాసేపు తెంచుకొన్న మనిషికి
విడిచి వచ్చిన దిగుళ్ళని గుర్తుచేయకు

కారణాతీత లోకమొకటి
ఎవరిలో నుండైనా అకస్మాత్తుగా పిలుస్తున్నపుడు
నేలమీది వ్యాకరణాలన్నిటినీ ఒకేసారి విదిలించుకొని తనతో ఎగిరిపోక
భద్రగృహాల తలుపుల్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని
రెండో చేతిని ఆకాశానికి చూపిస్తే ఏం ప్రయోజనం 

మనిషి సునాయాసంగా పువ్వైనపుడు, పక్షైనపుడు
ఇంద్రధనువో, నీటితుంపరో, ఆకాశమో అయినపుడు
అసలేమీకాకుండా మిగిలినపుడు, మిగలనపుడు
సూర్యుణ్ణొక ఆనందబిందువు చేసి మనపై కాంతి కురిపిస్తున్నపుడు
కారణాల లంగర్లు విప్పుకొని
అతని ఆనందంలోకి హాయిగా, దయగా మనల్ని కోల్పోయి చూడాలి

కారణమేం కానీ, పసిబిడ్డలాంటి పరవశమేదో
సాటి మనిషినొక  తెల్లనిమేఘం చేసి
రా అనగానే వెళ్ళగలిగినవాడిదే కదా, స్వర్గం!

17 ఆగస్టు 2014

వెళ్ళనీ

వెళ్ళనీ అంటారు అమృతవిద్య తెలిసినవారు 
పనితొందరలో వున్నట్టు పరుగులుపెట్టే గాలికీ, నీటికీ, కిరణాలకీ
నీ చేతులు విశాలంగా చాపి మరీ వీడ్కోలు పలికినట్టు
మనుషుల్నీ, ఊహల్నీ కూడా నిన్ను విడిచి వెళ్ళనిమ్మని అంటారు

జ్ఞానమనీ, మోక్షమనీ చెబుతారే అదేమిటని అడిగినప్పుడు
ఏదీ ఉండదనే వివేకంలోకి మేలుకోవటమే జ్ఞానమనీ
అన్నిటినీ సహజంగా పోనివ్వటమే మోక్షమనీ చెబుతారు

వెళ్ళిపోతే కొత్తవి వస్తాయా అని అడుగుతామా 
కొత్తవి వచ్చే హామీ లేదు కాని
వెళ్ళనివన్నీ ఉన్నచోటనే జీవం కోల్పోతాయని చెబుతారు

వేటినీ వెళ్ళనివ్వం కనుకనే
మన చుట్టూ ఎడారుల్ని కావలికాస్తున్న దిగులు 
మన ముఖాలపై చీకట్లను దాస్తోన్న వెల్తురు నవ్వులు 

హుందాగా వెళ్లనివ్వటం మరిచినపుడల్లా
కిరణాల్లా బయలుదేరిన మనం నీడలుగా మారిపోతాం   

ఈ బానిసత్వాన్ని ప్రేమగా భ్రమించి మురిసిపోతామా
స్వేచ్చ తెలిసినవాడు రహస్యంగా సమస్తాన్నీ ప్రేమిస్తూ వుంటాడనీ
బంధాలలో మునిగినవాడు రహస్యంగా తనని కూడా ద్వేషిస్తాడనీ  
మనం ద్వేషిస్తామని తెలిసి కూడా ప్రేమకొద్దీ చెబుతూనే వుంటారు

16 ఆగస్టు 2014

నీలో కొన్నిసార్లు

నీలో కొన్నిసార్లు ఉత్సవముంటుంది

అప్పుడు నీకందర్నీ పలకరించాలనిపిస్తుంది
పూలతో, పిట్టలతో, దారినపోయే మనుషులతో
నీకు తోచిన మాటలన్నీ మాట్లాడాలనిపిస్తుంది
దు:ఖంచే నేత్రాలపై మృదువుగా ముద్దులు పెట్టాలనిపిస్తుంది
ఎవరేమనుకొంటే ఏమిటని తోచినపాటలన్నీ పాడాలనిపిస్తుంది
దేహాన్నొక కెరటం చేసి నర్తించాలనీ,
నలుగురు పిల్లల్ని పోగుచేసి పరుగుపందెంలో వాళ్ళతో ఓడిపోవాలనీ అనిపిస్తుంది

నీలో కొన్నిసార్లు నిరాశ వుంటుంది

అప్పుడు ప్రకాశిస్తున్న ఎండలోకి ఎవరో చీకటిని ఒంపుతున్నట్లుంటుంది
కనిపించని తలుపులన్నిటినీ మూసుకొంటూ లోలోపలికి వెళ్ళిపోవాలనిపిస్తుంది
గండశిలలాంటి కాలాన్ని పగలగొట్టి దిగంతాలకి విసిరేయాలనిపిస్తుంది
తెలియని ఉప్పెన ఏదో నలువైపులా నుండీ ముంచేస్తున్నట్లుంటుంది
విసుగువేరు తొలుచుకొంటూ వెళ్ళి నిన్ను పూర్తిగా ఖాళీ చేసుకోవాలనిపిస్తుంది

కొన్నిసార్లు భయముంటుంది నీలో

రాత్రి వచ్చిన కలచివర ఊహకందని శక్తి ఏదో నిన్ను ఎత్తుకుపోయినట్లుంటుంది
నిన్ను నొక్కిపెడుతున్న ఎవరినో శక్తికొద్దీ విసిరేయాలనిపిస్తుంది
రానీ, చూసుకొందామనే మొండిధైర్యంలోకి పూర్తిగా దూకేయాలనిపిస్తుంది
ప్రపంచాన్నంతా కూర్చోబెట్టి గబగబా పాఠాలు చెప్పేయాలనిపిస్తుంది

కొన్నిసార్లు నీలో శుభ్రమైన మౌనం వుంటుంది

ప్రపంచాన్ని చూసి ఒకే ఒక పసినవ్వు నవ్వాలనిపిస్తుంది
రాలినపూవు నేలని తాకిన చప్పుడు నీలో కోమలంగా కరిగిపోయినట్లుంది
సూర్యోదయాన్ని దోసిలిలో ఒంపుకొని సుతారంగా త్రాగినట్లుంటుంది
ఆకాశం ఒక పక్షిరెక్కయి శాంతిలోకి ఎగురుతున్నట్లుంటుంది

అప్పుడు మాత్రమే నీకు నువ్వు నిజంగా పుట్టినట్లనిపిస్తుంది