21 అక్టోబర్ 2025

కవిత : వేసవిరాత్రి వాన

వీధిలో నడుస్తూ అమ్మ
భుజంపై నిద్రపోయే నిన్ను పొదివి పట్టుకున్నట్లు 
వేసవిరాత్రి ఉన్నట్లుండి వాన కురుస్తుంది

వాన నీటిని మాత్రమే ఒంపదు 
నీటితో నిండిన గాలినీ, గాలితో నిండిన శబ్దాలనీ,
వాటి వెనక దాగిన ఆకాశాన్నీ, నిశ్శబ్దాన్ని కూడా

వాన కురిసినపుడు కరుణ కురిసినట్లుంటుంది
జీవితమ్మీద లాలస కురిసినట్లు,
జీవితేచ్ఛ విత్తనమ్మీద అగాథ నిశ్శబ్దమేదో కురిసినట్లు

వాన కురిసిన రాత్రి ఒంటరిగా మిగులుతావు,
చుట్టూ ఖాళీ స్థలం ఒంటరిగా మిగులుతుంది,
ఖాళీలో కలలు ఒంటరిగా మిగులుతాయి
వాన అంటుంది
ఈ క్షణం బ్రతుకు, ఇంతకన్నా ఏమీలేదు

వాన రాలే వేళల నీకేమీ పని వుండదు 
వానని ప్రేమించటం మినహా,
వానలో ఎంతకీ తడవని చీకటినీ, 
చీకటిలో ఎంతకీ మునగని జీవితాన్నీ
మోహించటం మినహా

లోపలికంటా కురిసే ఒక వాన చాలు
మానవ హృదయాలలోని
ఇంత చీకటి చెరిపేయడానికి

బివివి ప్రసాద్

20 అక్టోబర్ 2025

కవిత : రంగుల పిల్లలు

రంగులు అమాయకమైనవి,
నలుపు, తెలుపుల్లా కలలు రాలిపోయినవి కావు,
పసిపిల్లలు ఉల్లాసంగా మేల్కొన్నట్లు
ఉదయాన గగనంలో మేలుకొంటాయి

ఇంద్రధనువుల మీదుగా,
సీతాకోకల రెక్కల మీదుగా, పూలని చేరి, 
నీ వైపు నవ్వుతూ దర్శనమిస్తాయి

రంగులు ఈ లోకం మీద నీ ఆశలు నిలిపేవి,
ఆశల మీద ఈ లోకాన్ని నిలిపేవి

ఎంత దుఃఖంలోనూ
ఎక్కడో ఆశ ఉంటుంది చూసావా
అస్తమయ బింబం ఆకాశంలోకి విసిరే 
చివరి నారింజ కాంతిలా

అట్లా, నలుపు, తెలుపుల
దుఃఖానందాల కెరటాల మధ్య
రంగులు నీకు ఆశ కల్పిస్తాయి అమాయకంగా
ఇక్కడింకా ఏదో ఉందని

తెలియందేదో లోకంగా వికసించిన ఇక్కడికి
పసిపిల్లల్లా గునగునా నడుస్తూ 
ఆరిందాల్లా వస్తాయి రంగులు,
అంతటినీ చక్కదిద్దే ఘనుల్లా

ఆడింది చాలు పడుకోండని 
అమ్మా, నాన్నల వంటి
నలుపు, తెలుపులు పిలిచినపుడు,
బొమ్మల్లాంటి మనని విసిరేసి
ఏకైక మహాశాంతిలోకి జారిపోతాయి

రంగుల్ని నమ్ముకున్న మనం
ఏకైక శూన్యంలో
లోలకంలా వ్రేలాడుతూ ఉంటాం
...

ఇప్పుడు కలల్లోకి ప్రాకుతూ వచ్చిన రంగులు
నీతో ఏం మాట్లాడుతున్నాయి

బివివి ప్రసాద్ 

ప్రచురణ : ‘వివిధ’ ఆంధ్రజ్యోతి 20.10.25
https://epaper.andhrajyothy.com/article/NTR_VIJAYAWADA_MAIN?OrgId=201084adc9f1&eid=0&imageview=1&standalone=1&device=desktop

19 అక్టోబర్ 2025

కవిత : వేసవి మధ్యాహ్నం

ఎండ కాస్తున్నపుడు 
నీకొక కల మొదలైనట్లుంటుంది
లేదా, కలలో ఎండ కాస్తున్నట్లుంది

జీవితం నిన్ను గట్టిగా పిలుస్తుంది అపుడు
సీతాకోకరెక్కల్లో ఒదిగిన సంగీతంలానో,
ఇంద్రధనువులో ఒదిగిన సంధ్యాకాశంలానో,
కొలనుచంద్రునిలో ఒదిగిన శాంతిలానో కాక

అమ్మ నిన్ను ఒక్కసారి అరిచినట్లు,
మాష్టారు గట్టిగా పాఠం చెప్పినట్లు,
మిత్రుడు నీపై భళ్ళున నవ్వినట్లు
ఎండ ఒకసారి విరబూస్తుంది 
ఏ పదకొండు దాటిన వేసవిరోజునో

ఉన్నట్లుండి మేలుకుంటావు
ఎండలో చిక్కబడుతున్న నీడల్లా 
నీలో చిక్కబడుతున్న సందేహంలోకి,
ఇదంతా నిజమా, అసలంటూ నిజమొకటుందా,
నిజమైనా నిజంగా ఉందా అంటూ

భళ్ళున పగిలిన అద్దంలాంటి ఎండ
మెరుస్తుంది, లోకాన్ని గుచ్చుతుంది, 
మెత్తగా పాములా పడగ విప్పిన సందేహం
మెరుస్తున్న కళ్ళతో నీ కళ్ళలోకి చూస్తుంది

వేసవి పదకొండు మధ్యాహ్నం
ఇది కలా, నిజమా అని నిన్ను అడుగుతుంది

బివివి ప్రసాద్

18 అక్టోబర్ 2025

కవిత : ఒక మిత్రుడు

ఒక మిత్రుడుండేవాడు
ఉదయపు సూర్యకాంతీ, మధ్యాహ్నపు వేడిమీ,
సాయంత్రపు గాలితెరలూ, నక్షత్రాల గుసగుసలూ 
కలిపి తయారుచేసినట్లు

వాడుంటే సందడుండేది, సందడుంటే వాడుండేవాడు,
ఒకానొకరోజు ఇక చాలురా అని వెళిపోయాడు
కాంతీ, వేడిమీ, తెరలూ, గుసగుసలూ పుట్టేచోటికి

వాడిక రాడు, అలాగని నువ్వూ మిగిలేది లేదు,
వాడిలాగా జీవితాన్ని అనుభవించలేదు నువు,
మనుషుల్ని ప్రేమించలేదు,
వాడిలాగా బ్రతుకుపండగ చాతకాలేదు

ఇలా ఉంటుంది జీవితం
ఉండవలసినవాళ్ళు ఉండరు,
వెళ్ళవలసినవాళ్ళు వెళ్ళరు 

వాడిని తలిస్తే దుఃఖమేమీ రాదు,
ఉన్నట్లుండి వీచే గాలితెరలా
వాడి జ్ఞాపకాలలోంచి రాలే సంతోషం తప్ప,

వాడికి కళలు తెలియవు,
గెలుపుపందెంలో పరుగు కోరుకోలేదు,
సామాన్యంగా బ్రతికి, సామాన్యంగా వెళిపోయాడు,
నువు చూడని రోజుల్లో కూడా
నీ ఊరిచుట్టూ నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న కాలువలా

(చక్కా శ్రీనివాస్ స్మృతిలో)

బివివి ప్రసాద్

17 అక్టోబర్ 2025

కవిత : అనుభవం

 అనుభవానికి దగ్గరగా జరుగుతావు
జీవితం చాలా గడిచిపోయాక,
చివరి మలుపు తిరిగి
ముగింపు దూరాన కనబడుతున్నపుడు

కలలూ, ఆశలూ కొన్ని ఫలిస్తాయి, 
చాలా ఫలించనట్లే
గడిచిన కాలమంతా గుప్పిటలోకి తీసుకుని
దీనిలో సారమేమైనా ఉందా అని వెదుకుతావు

గడిచిన ఊహల్నీ, ఆందోళనలనీ 
తడుముకొని చూస్తావు
చాలా సంగతులకి అర్థం ఉండదు,
చాలా ఊహలు ఏ ఫలితం చూపకనే ఆవిరయాయి
ఎండమావులలోని నీటిలా

మరోసారి గడిచిన కాలాన్ని జీవించే అవకాశం వస్తే 
చాలా పనులు చేయవు,
చాలా అనుభవాలు కోరుకోవు

ఉదయపు కాంతి దీవించిన అనుభవం, 
తాజాగాలులు తాకుతూ వెళ్లిన అనుభవం,
పూలు విప్పారుతూ ఆశ్చర్యపరిచిన అనుభవం,
పక్షి కూత గాలిలోకి పలుచని వల విసిరిన అనుభవం 

వీటికన్నా అపురూపమైనవేమీ లేవని
నీ భయాల, గర్వాల, దుఃఖాల తర్వాత తెలుస్తుంది

చివరిమలుపులో నీకు తెలియవస్తుంది
సూర్యకాంతీ, నక్షత్రాలూ నిన్నెంత ప్రేమించాయో,
నిను కన్నతల్లి 
నీలో ఎన్ని పగళ్ళనీ, రాత్రుల్నీ కలగన్నదో,
తల్లినీ, జీవితానుభవాన్నీ ఎంత నిర్లక్ష్యం చేసావో

బివివి ప్రసాద్

16 అక్టోబర్ 2025

కవిత : పొడి సాయంత్రం

 అవును, సాయంత్రపు రంగులకాంతి 
విరజిమ్ముతుంది సమానంగా
ఎడారిలోనూ, అడవిలోనూ, 
నది మీదా, సమూహాల మీదా

ఎడారి రంగులకాంతిని పిలుస్తుంది, 
అడవి తనలోకి ఒంపుకొంటుంది,
అలలనది ఆటలాడుతుంది తనతో,
సమూహం తనని అంటకుండా
ధూళి నిండిన పనుల్లో మునుగుతుంది

ఇంత అందమైన కాంతిని,
కాంతిని ఒంపే విశాలమైన గగనాన్ని కాదని
వీళ్ళేం చేస్తున్నారని విస్మయపడుతుంది సాయంత్రం

ప్రతి సాయంత్రం జీవితమొక ప్రేమలేఖ పంపిస్తుంది
అవని సమస్తానికీ
జీవితమెంత అందమైనదో చూడమని,
జనులు మాత్రం, 
సాయంత్రాలని గడియారాల్లో గుర్తుపడతారు

చూస్తూ ఉండగా చీకటి పడుతుంది
ఆకాశంలో కొంత వెన్నెల ప్రసరిస్తుంది,
చీకటిలో మునిగినవారిలోకి
వెన్నెల ఏ మాత్రమూ ఇంకకపోగా
చివరి చీకటి మరికాస్త వేగంగా సమీపిస్తుంది

బివివి ప్రసాద్

15 అక్టోబర్ 2025

కవిత : బాల్య స్నేహం

జారిపోయే నిక్కరు పైకి లాక్కుంటూ
ఆవేశంగా కబుర్లు చెప్పుకునేటపుడు 
విడిపోయిన అమ్మాయి
అరవై ఏళ్ళకి కనబడి, ఏడుస్తూ అంది
ఇన్నాళ్ళూ ఎక్కడికి పోయావు

అతనన్నాడు
సరే, ఇప్పుడు నేనేం చేయాలి
అప్పటి ఆకాశాన్ని మళ్ళీ పట్టుకురానా,
అప్పటి గాలిని వీచమని బ్రతిమాలనా,
అప్పటి అమాయకత్వాన్ని వెదుకుతూ వెళ్ళనా

తను అంది 
వద్దులే, ఇప్పుడు వెళితే, ఎప్పుడు వస్తావో 
ఇక్కడే ఉండు కళ్ళముందు, చాలు

అవాళ్టి సూర్యుడు
ముసిముసి నవ్వులు నవ్వుతూ నిద్రపోయాడు,
ఆ రాత్రి నక్షత్రాలు గుప్పున విరబూసాయి,
మళ్ళీ క్రొత్తగా పుట్టిన ఇద్దరు పిల్లలు
కాలం జారుడుబల్లపై
గాఢమైన శాంతిలోకి జారిపోయారు 

బివివి ప్రసాద్

14 అక్టోబర్ 2025

కవిత : సీతాకోకల కథ

రెండు తెల్లటి ప్లాస్టిక్ సీతాకోకల్ని 
తలలో తురుముకుంది ఆ అమ్మాయి

చీకటి సెలయేళ్ళ వంటి శిరోజాల్ని 
జారిపోకుండా పట్టుకొని, కదలకుండా ఎగురుతున్న 
సీతాకోకలు ఆ అమ్మాయితో ఏం చెబుతాయి,
లేదా ఏం చెప్పాయని తనతో తెచ్చుకొంది 

జీవితం కాంతికి కాంతితోనే బదులిస్తే
రంగుల్ని దాటి తెల్లగా వెలుగుతావు అనా,
నల్లని జీవితం ముసురుకొన్నపుడు
తెల్లని కాంతిలోకి దారి చూపిస్తాము అనా

మేం మాట్లాడం, నువ్వూ మాట్లాడకు
ఊరికే చేతుల్లోకి తీసుకుని ఎగరేయి,
మా రెక్కలు చాపి ఎగురుతూ వుంటాము,
మాదైన విశాల గగనంలోకి తీసుకుపోతామనా

మాకు రెక్కలున్నాయి, ఊహల్లేవు,
నీకు ఊహలున్నాయి, రెక్కల్లేవు,
నీ ఊహలకి మా రెక్కలు తగిలించి
మనదైన మాంత్రికనగరం సృష్టించుకుందామనా

వాళ్లేం మాట్లాడుకుని ఒప్పందానికి వచ్చారో తెలీదు,
మాటలేమీ లేకుండానే ఒకరినొకరు చేరారో తెలీదు,
అవి పిలిస్తే ఆ అమ్మాయి ఎగురుతూ వెళ్ళిందో,
తాను పిలిస్తే అవి నడుచుకొంటూ వెళ్లాయో తెలీదు

ఇట్లా, నువ్వు వాళ్ళ మధ్య చేరి
వారి నడుమ ఉన్న రహస్యాలని పసిగట్టబోతావా, 
వారి మంత్రనగరిలోకి దారి వెదకబోతావా, 
ఆ అమ్మాయిని అటు తిరగనిచ్చి,
సీతాకోకలు నీ వైపు తిరిగి అంటాయి కదా

కవీ, నీ కింకా పిల్లచేష్టలు పోలేదు,
ఇతర్ల స్థలంలోకి నువు చొరబడనప్పుడే
నీ స్థలమేదో నిజంగా గుర్తుపడతావు,
నీలో నువ్వు నిలబడినప్పుడు
నీ లోపలికే మేం మరలా చేరిపోతాము

ఇట్లా ఊహిస్తూ ఉన్నావంటే
నీలోంచి సీతాకోకలై ఎగురుతూనే వుంటాము,
మాతో పాటు సూర్యరశ్మినీ, అది పొంగిపొర్లే ఆకాశాన్నీ,
మా అంతటినీ దాచుకునే, పంచిపెట్టే జీవితమనే
వృద్ధురాలి బరువునీ నీపై మోపుతూనే వుంటాము

ఉలికిపడి చూసేసరికి,
సీతాకోకల అమ్మాయి వెళ్ళిపోయిన ఖాళీలో 
కంటికి తగలని నీరెండ సీతాకోకలా ఎగురుతోంది

బివివి ప్రసాద్

13 అక్టోబర్ 2025

కవిత : వానతెరలు

కొన్ని వానతెరలూ, తడుస్తూనో, చూస్తూనో
కాసేపు పరుగాపి నిలబడిన ప్రపంచం,
వానలో నాని, మసకబారిన పగటి కాంతీ,
సమస్తాన్నీ కూర్చోబెట్టి
ఈ క్షణంలో జీవించటమెంత బావుంటుందో
విసుగులేకుండా బోధిస్తున్న వానచప్పుడు

ఇది కదా జీవితం అనిపిస్తుందపుడు,
వేడి ఆవిరులు తొలగి, చల్లదనం ఇంకుతున్నట్లు
దుఃఖభారం తొలగి, జీవించే ఆశ ఇంకుతూ వుంటుంది

వాన కురిసే క్షణాలు, క్షణాల్లా కురిసే వానచినుకులు
నీ నుండి తప్పిపోయి దిక్కుతోచక తిరుగుతున్న నిన్ను,
చల్లని గాలితెరలతో కప్పి, గుండెలకి హత్తుకొని,
భయపడుతున్నావా అని లాలనగా అడుగుతాయి

వానలేని ప్రపంచాన్ని ఊహించలేవు,
వాన కాలేని మనుషుల్ని ఊహించలేనట్టే

వాన కురిసే సమయంలో, నింగిపొరల్లో దాగిన,
నీ సోదరులుండే సుతిమెత్తని స్వర్గమేదో, 
ఇంద్రధనువులోంచి లీలగా కనిపించకపోతుందా అని
బేలగా ఆకాశం వంక చూస్తావు

వాన కురుస్తూ వుంటుంది, 
కలల్ని మెత్తబరుస్తూ వుంటుంది,
కలల కాంతిలో మునిగిన నువ్వు
వాన ఆగిందని గుర్తించటం ఇష్టం లేక
నీ కలల్లోకి తిరిగిరాలేనట్టు తప్పిపోతావు

బివివి ప్రసాద్
ప్రచురణ : కవితా! 89 అక్టోబర్ 25 దీపావళి సంచిక





12 అక్టోబర్ 2025

సున్నిత సౌందర్య తాత్విక భావనా విపంచి బి.వి.వి.ప్రసాద్

 విమల సాహితి లో ప్రసాద్ కవిత్వంపై కృష్ణవేణి పరాంకుశం గారి వ్యాసం. వారికి ధన్యవాదాలు.




కవిత : చీకటి

చీకటి కమ్ముతుంది, నక్షత్రాల కంబళి విప్పుకొని,
విశాల గగనం నుండి వీధుల్లోకి దిగుతుంది,
వీధుల్లోంచి గదుల్లోకి చొరబడుతుంది

చీకటిని ప్రేమగా పలకరిస్తాయి
వీధుల్లో, గదుల్లో వెలిగే దీపాలు,
దీపాలలో వెలిగే హృదయాలు,
హృదయాల్లో వెలిగే జీవనానందాలు

ఇక, చీకటి వరద పోటెత్తిన నదిలా
కమ్ముతుంది నిన్నూ, నన్నూ,
మనం మిగుల్చుకున్న నేనునూ, నాదినీ 

నల్లని చీకటి, దేహాన్ని అంటీ అంటని చీకటి,
చూపుల్ని కప్పీ, కప్పని చీకటి,
నీకు శాంతిని ఇచ్చీ, ఇవ్వని చీకటి,
నిండైన ఏకాంతాన్ని కానుక చేసే చీకటి

అప్పుడంటావు దేవుడితో
"దుఃఖ భూయిష్టమైన పగళ్ళు ఎందుకు తండ్రీ,
జీవితమంతా చీకటితో నింపు"
ఆయన నవ్వుతూ అంటారు
"నువు చూసే పగలు కూడా చీకటిలోనిదే,
కన్నా, ఈ చీకటి అంతకీ వెలుగు నువ్వే"

బివివి ప్రసాద్
ప్రచురణ : సంచిక.కాం 12.10.25
https://sanchika.com/cheekati-bvvp-poem/

11 అక్టోబర్ 2025

కవిత : నీపై రోజులు

కొన్ని రోజులు దయగా ఉంటాయి నీపట్ల,
బంగారుకాంతిలోనో, నీటిపొరపై మిలమిలలలానో,
మరికొన్ని అగ్నిలానో, పొగలానో, బూడిదలానో ఉన్నట్లు
ఇదంతా వెలుగు నీడల ఆట

తల్లి చుట్టూ దాగుడుమూతలు ఆడే బిడ్డల్లా 
నీ చుట్టూ దాగుడుమూతలు ఆడతాయి
పగళ్ళూ, రాత్రులూ, ఆనందాలూ, దుఃఖాలూ 

నువు కదిలిపోయినట్టుంటావు, కదలవు,
ఏడ్చినట్టూ, నవ్వినట్టూ తోస్తుంది
ఏమీ చేయవు, చేయలేవు

ఉత్త ప్రశాంతత నీవైనట్లు,
ఉత్త ఖాళీ నీవైనట్లు,
అర్థంలేనితనం నీవైనట్లు

వెర్రివాడిపై కురిసే ఎండలా, నీడలా,
వానలా, వెన్నెలలా, మంచుతెరల్లా 
జీవితం నీపై కురుస్తూ వుంటుంది

రోజుల పెట్టెల్లో దాచిన అనుభవాలు ఒంపుతుంది,
రోజుల గదుల్లోని పనులు నీతో చేయిస్తుంది

ఇంతా చేసి ఇది జీవితం,
అనుభవాల అనుభవం,
నక్షత్రాల సమూహం,
నక్షత్రాలు ఈదే నల్లని కాంతిసముద్రం

దయగల రోజులూ, దయలేని రోజులూ 
గడిచిపోతాయి నువు కావాలన్నా, వద్దన్నా

ఇక మిగిలేదల్లా నువ్వు
విశాలమైన మైదానంలో
గొల్లబాలుని పిల్లనగ్రోవి పాటలా
తెరలు తెరలుగా వ్యాపించే,
ఎప్పటికీ వ్యాపిస్తూ ఉండే నువ్వు

బివివి ప్రసాద్

10 అక్టోబర్ 2025

కవిత : కలలు కంటావు

కొన్ని కలలు కంటావు

ఉదయాన పూలపై వాలిన నీరెండవి అయినట్లు,
వానగాలిలో ఎంతకీ చలించని ఇంద్రధనువైనట్లు,
పక్షి ఎగిరిపోయినా ప్రతిధ్వనిస్తున్న కూతవైనట్లు,
సీతాకోక రంగులు సృష్టించే కొత్త శూన్యానివైనట్లు

ఊరికే కలలు గంటావు
కలలు కనటానికే పుట్టినట్లు,
అంతకన్నా అందమైన పనేమీ లేనట్లు
చేయాల్సినదేమీ తోచనట్లు 

కలల నుండి కలలకి, కలల్లోపలి కలల్లోకి,
కలల కెరటాల తాకిడి మెత్తగా తాకే
మృదువైన తీరాల నుండి
విశాల మైదానాల్లోకి, మైదానాలపై ఆకాశాల్లోకి,
ఆకాశాలని దాచుకున్న అనంతశూన్యంలోకి,
అటునుండి కలల్లేని చోటికి మేలుకుంటావు

కలలు కనలేని కఠినమైన లోకం నుండి,
కలల అవసరంలేని లోకానికి వెళ్ళే దారిలో,
కలలే నీ బాల్య స్నేహితులు
కలలే నీ ప్రాణ వాయువు
కలలే నీ జీవనసారం

బివివి ప్రసాద్

09 అక్టోబర్ 2025

కవిత : జీవితానుభవం

 జీవితానుభవం రెండు ఆకాశాల మధ్య
అలవోకగా తప్పించుకునే దేవకన్య
ఇది జీవితమంటావు ఆమె తప్పుకుంటుంది,
జీవితం కాదంటావు 
తప్పుకుంటుంది సులువుగా, నవ్వుతూ

జీవితానుభవం ఇలాంటిదని చెప్పలేవు,
అలాగని దానికోసం వెదకటం మానలేవు
ఉదయాస్తమయాలు రంగులలో పలకరిస్తాయి
ఇవాళైనా నీకు తెలుస్తుందా అని ఒకటి,
ఇవాళైనా తెలిసిందా అని మరొకటి

జీవితానుభవం 
మసకచీకటిలో దాగిన ప్రియమైన వ్యక్తిలా
నిను కవ్వించి మాయమవుతుంది,
చీకటి నీడల్లోకి చేతులు చాపి పట్టుకోబోతావా
ఖాళీ ఆకాశం తగులుతుంది

జీవితం దుఃఖం, జీవితం ఆనందం
జీవితం భయం, జీవితం ప్రేమ

ఇష్టదైవంపై మోజు పడిన భక్తుడిలా
జీవితంపై మోజుపడి తల్లడిల్లుతావు

బహుశా, ఇంతా చేసి, 
నిన్ను నువ్వు పట్టుకోబోతావు
నీ నీడని కౌగలించుకోబోతావు
నీలోకి నిన్ను చెరిపేసుకోబోతావు

నీలోపలి శూన్యంలోకి
నిన్ను విసిరేసుకోవటమెలానో 
తెలియక వెర్రిగా చూస్తావు

బివివి ప్రసాద్

08 అక్టోబర్ 2025

కవిత : ఆ ఒక్కటీ..

ఒక్కటి మాత్రం చాతకాలేదు నీకు
ఆ నిమిషంలో సంతోషంగా ఉండటం,
ఇతరుల్ని సంతోషంగా ఉండనీయటం 

అలాగని, బుద్ధిహీనుడివీ, స్వార్థపరుడివీ కావు
నువు వదలలేని గాయాల భారం,
నిన్ను వదలలేని కలల తేలికదనం 
నిన్ను ఈ నిముషంలో ఉండనీయలేదు 

ఈ క్షణంలోకి ప్రవహించటమెలానో,
క్షణాన్ని నీలో ప్రవహింపనీయటమెలానో 
సృష్టిలో ఇంతకాలమున్నా చాతకాలేదు
బడిలో చివరిబల్ల విద్యార్థిలా,
ప్రవాహంలో తోచక నిలిచిన ఎండిన చెట్టులా
జీవితాన్ని చూస్తున్నావు

ఆ ఒక్కటీ నేర్చుకుంటే చాలని
ఒడ్డున కూర్చుని ఈతలోని ఆనందాన్ని
వర్ణించినట్టు వర్ణించావు

అలాగని, మర్యాదస్తుడివీ, పిరికివాడివీ కావు
నువ్వు వదలలేని ఆలోచనల భారం,
నిన్ను వదలలేని అనుభూతుల తేలికదనం
నిన్ను ఈ నిముషంలో బ్రతకనీయలేదు

రాత్రి వెన్నెలలో పక్షి కూత కరిగిపోయినట్టు,
చీకటిలో ఇంత విశాలదృశ్యం భద్రంగా నిద్రపోయినట్టు,
ఉదయాకాశం కాంతిలోకి ఒళ్ళు విరుచుకున్నట్టు,
దుఃఖితులని చూసి దయాకమలం వికసించినట్టు

సహజంగా, సరళంగా, జీవితం కోనేటిలో
నీ బిందువులోని ఆకాశాన్ని కరిగించటమెలానో 
నీకిప్పటికి చాతకాలేదు

బివివి ప్రసాద్

07 అక్టోబర్ 2025

కవిత : వాన కురిసే రాత్రి

వాన కురిసే రాత్రి నువు ఒంటరివవుతావు,
సమీపంలో ఎవరున్నా, లేకున్నా
నీకు వానా, వానకి నువ్వూ మిగులుతారు

చీకటి కురిసే రాత్రులు సైతం
ఒంటరిగా ఉంటావు గానీ,
చీకటిలో వాన కురిసిందా 
కలతల్లేని, కలల అవసరంలేని
గాఢనిద్రలోకి జారుకుంటావు

వాన కురిసే వేళ 
నీకు నువ్వు నిజంగా దక్కుతావు
నిన్నెటూ కదలనీయని వానలో,
నీ ఊహల్లోకి చొరబడే వానలో
నీకు అక్కర్లేని నువ్వు చెరిగిపోయి, 
నీకు నువు కొత్తగా పరిచయమౌతావు

వాన కురవటమంటే జీవితం కురవటం గనక
వాన కురిసేవేళ నిన్ను నువు ప్రేమిస్తావు,
నీ జీవితాన్ని మోహిస్తావు,
ఎడతెగని వాన నిన్ను కాగితం పడవ చేసి
ఎటైనా తీసుకుపోతే బాగుండునని ఎదురుచూస్తావు

వాన కురిసే వేళ కాస్త భయపడినా గానీ,
నోవా పడవకి దొరకకుండా
అవధుల్లేని జలధిలో కొట్టుకుపోవాలని కలగంటావు 

వాన కురిసే వేళ 
వాన ఒక్కటే, వానలాంటి కరుణ ఒక్కటే
సృష్టిలో మిగలాలని దేవతల్ని బ్రతిమాలుకుంటావు

బివివి ప్రసాద్

06 అక్టోబర్ 2025

కవిత : ఇద్దరు

వాంఛ కన్నా లోతుగా, మోహం కన్నా లోతుగా,
స్నేహం కన్నా మరింత లోతుగా
ఆమె అతన్నీ, అతను ఆమెనీ కోరుకుంటారు చూసావా

అక్కడ, మబ్బుల్లో చందమామ తెరుచుకుంటుంది,
గాడాంధకారంలో దీపపుష్పం విచ్చుకుంటుంది,
వేగిపోయే ఎడారిలో చినుకు జారిపడుతుంది,
పొడిబారే హృదయంలో తడి ఏదో ఊరుతుంది

నువ్వే కావాలని రెండు హృదయాలు
ఒకటి కోసమొకటి తొలిసారి కొట్టుకుంటాయి చూసావా

అప్పుడక్కడ తొలి సూర్యోదయం ఫలిస్తుంది,
తొలిగా పూలు గాలిలోకీ, కాంతిలోకీ వికసిస్తాయి,
గాలితెరలు తమని తాము తెలుసుకొని
ఊరికే పిల్లల్లా గంతులేస్తాయి,
కోనేటి కలువలు ఇదంతా మునుపు చూసిందైనా
మళ్ళీ కొత్తగా వుందని ఆశ్చర్యపోతాయి

ప్రేమ; స్నేహాన్ని దాటిన ప్రేమ
తనదైన నిండుదనంలోకి ఇద్దర్ని మేల్కొలుపుతుంది,
రెండునదులు ఒక జీవితంలోకి కలిసి ప్రవహిస్తాయి,
బహుశా, అనంత సాగరంలో ఒకటిగా లీనమౌతారు,
అప్పుడనంత సాగరమూ వారి ప్రేమలో లీనమౌతుంది

బివివి ప్రసాద్

05 అక్టోబర్ 2025

కవిత : అమాయకత్వం

భూమి పుట్టినప్పటి అదే గాలి
ఇన్ని తరాలుగా అలానే వీస్తోంది
అమాయకంగా, దయగా,
అదే అమాయకమైన కాంతి,
అమాయకమైన పచ్చదనం

కాలం మరీ అమాయకురాలు
ఇదంతా ప్రేమమయమని
నమ్మకంగా చెబుతూ సాగిపోతోంది

ఒకానొక కాలంలో, ఒకానొక చోట
నువు పుట్టావు, జీవించావు
సెలవు తీసుకొని వెళ్ళిపోతావు,
కొత్త కథల్లోకి మేలుకొంటూ
ప్రపంచం నిన్నెక్కడో మరిచిపోతుంది

దీనినంతా ప్రేమించాలా, విడిచిపెట్టాలా 
తెలియదు నీకు,
గాలిలో గిరికీలు కొట్టే పక్షిలా
ఇక్కడిక్కడే తిరుగుతావు,
గాలిలో ఎగరాలో, నేలపై వాలాలో తెలియక,
జీవించాలో, మరణించవచ్చునో అర్థంకాక

పగటికీ, రాత్రికీ ఒకటే సందేహం,
ఇక్కడే ఉండాలా, ఇక వెళ్ళిపోవాలా అని,
ఉండలేక, వెళ్ళలేక వలయంగా తిరుగుతాయి

ఉత్త అమాయకత్వం తప్ప
జీవించటానికి అర్థమేముంది,
నీ చేతుల్లో లేని పుట్టుక, వీడ్కోలు,
నీ చేతుల్లో లేని కన్నీళ్ళు, చిరునవ్వులు

బివివి ప్రసాద్

04 అక్టోబర్ 2025

కవిత : గది బయట

ఆయనన్నది నిజమనుకుందాం,
నువు గదిలో వున్నపుడు, గోడల కవతల 
ఉత్త ఖాళీ మినహా లోకమనేదేమీ లేదు,
గోడల కవతల గతం లేదు, భవిత లేదని,
ఊరికే ఊహించుదాం, నమ్ముదాం

నమ్మకాలు, శబ్దాల గింజలు చల్లితే వాలే పావురాలు 
గనక, నమ్మటమేమీ కష్టం కాదనుకుందాం

గది కవతల ఉత్త ఖాళీ మినహా, 
ఆకాశం కూడా లేని, ఖాళీ కన్నా లోతైన ఖాళీ మినహా,
ఏమీ లేదనుకుందాం
ఏమైనా ఉందో, లేదో, తెలీదో, తెలుసో చెప్పలేని,
అయోమయంలో ఉన్నామనుకుందాం

భాషని భుజించి బ్రతికే కనరాని ఇంద్రియమొకటి 
భాషని దాటలేక, భాషలో బ్రతికే ఊహని దాటలేక,
చతికిలబడిందనుకుందాం

అపుడు, గది వెలుపలి ఖాళీనే గది లోపల ఉంటుంది,
రెక్కలపై ముసిరిన వల చెరిగిపోయి,
పక్షి గగనంలో తేలుతుంది

ఆయనన్నది కాసేపు నిజమనుకుందాం
గదిలోనే కూర్చుని, గది బయటి ఖాళీ లో 
మునుగుదాం లేదా తేలుదాం

• ఆయన : ఒక మిస్టిక్, ఒక గురువు

బివివి ప్రసాద్

03 అక్టోబర్ 2025

కవిత : ఆగటం

ఆగటం మినహా వేరే దారి వుండదు,
ఉద్వేగాలని ఆపటం మినహా

రాలిపోయే ఎండుటాకు మరో క్షణం ఆగినట్టు,
వికసించే పూలరేకులు ఆలోచనలో పడినట్టు
లోపల్నించి రాలే మాటలని, ఉద్వేగాలని 
కాసేపు ఆగమనటం మినహా,
భద్రమైన నిర్ణయం కనబడదు
ఇక్కడ ఇలా వుంటుంది,
నీకేమీ తెలియదు కొన్నిసార్లు, ఆగిపోవటం మినహా

ఆగిపోయిన క్షణాలు
జీవితాన్ని ఎటూ కదలనీయక పోవచ్చును,
ఆగలేకపోయే క్షణాలు చూపించే మలుపుల కంటే
ఆగటం సరైనది కావచ్చును

ఎక్కడ ఆగాలో, కూడదో, నీ స్వంత నిర్ణయమో, 
ఏ శక్తుల ఆటనో నీకు తెలియక పోవచ్చును

ఏమైనా, ఆగటం మినహా
ఆగి, ఇవాళ రాత్రి చంద్రుడెపుడు ఉదయించాడో,
వెన్నెల ఎంత నిశ్శబ్దాన్ని లోకానికి కానుక చేసిందో,
లోకపు దుఃఖమో, నాటకమో 
నీలోంచి ఎంత పలికిందో చూసుకోవటం మినహా,
ఇవాళ పెద్దగా పనేమీ లేకపోవచ్చును

నిజానికి, ఆగిన క్షణాల్లో, 
నువు జీవితానికి అతి దగ్గరగా
చలించే గ్రహంలా ఉండి వుండవచ్చును

ఆగిన క్షణాలు నిన్ను నీకు మిగల్చక పోవచ్చును,
నిన్ను మాత్రమే నీకు మిగల్చవచ్చును

అప్పుడపుడు ఆగటం బావుంటుంది,
సెలయేరు ఆగి కోనేరు అయినట్లు,
చంద్రుడు ఆగి కోనేటిలో చూసుకున్నట్లు,
తుమ్మెద ఆగి పూలరేకులు చూసినట్లు,
పూలు వికాసం ఆపి తుమ్మెదని పిలిచినట్లు,
తీరికవేళ వీధి అరుగుపై మనిషి మాటలకు పిలిచినట్లు,
సాయంత్రపు గగనంలో చివరి రంగులు ఆగి
ఇంకెవరైనా చూసే వాళ్ళున్నారా అని అడిగినట్లు

ఊరికే ఆగటం బావుంటుంది
ఆగి, జీవితం లాంటి నిన్నూ, నీలాంటి జీవితాన్నీ
మనసారా కావలించుకోవడం బావుంటుంది

బివివి ప్రసాద్

02 అక్టోబర్ 2025

కవిత : జీవనానందం కొసన..

ఏవో పిచ్చిమాటలు మాట్లాడాలనిపిస్తుంది,
మాటలన్నీ పిచ్చివేనేమో తెలీదు

ఇంత అద్భుతంగా, నల్లగా మిలమిలలాడే రాత్రి
నీపై తెరపిలేకుండా కురుస్తున్నపుడు
మాటలేం అవసరమొచ్చాయి
మౌనంలోకీ, జీవితంలోకీ మునిగిపోక

ఊరికే మాట్లాడాలనిపిస్తుంది,
జీవనానందం తట్టుకోలేక
మాటల్లోకి తేలి ఊపిరి పీల్చుదామని

ఆయనన్నారు చూసావా
మనసు బ్రద్దలైన ఆనందం తట్టుకోలేక 
ప్రాణం వదిలేశారని, 
ఆ మాటకే మనసు బ్రద్దలౌతుంది 

జీవనానందం, నువు ఉండటంలో ఉందో,
ఉండీ, లేకుండా పోవటంలో ఉందో తెలీదు,
అదంటూ ఒకటి ఉన్నట్లుంది 

మాటలు తయారయే మనసులో 
ఎన్ని మెలికలు వుంటాయో చూసావా,
వాటికి ప్రలోభపడకుండా ఉండగలవా

ఈ రాత్రిని రాత్రిలా, గాలిని గాలిలా,
ఈ నక్షత్రాలని నక్షత్రాల్లా 
దేహంపై వస్త్రాలు లేనట్లు, దేహమే లేనట్లు
నిన్ను తెరుచుకొని అనుభవించగలవా
పొందుతున్నావో, పొందబడుతున్నావో తెలీని
పారవశ్యంలో మునగగలవా

ఇది జీవిత, మిది కాదని జీవులు చెప్పలేరు,
జీవులకంత తెలివుంటే,
వాటిని కన్న జీవితానికెంత తెలివుండాలి
నువు జీవివి కాదు, 
జీవితానివని తెలిసేందుకు ఎంత దుఃఖపడాలి
ఎంత పదునుదేరాలి 

బివివి ప్రసాద్

01 అక్టోబర్ 2025

కవిత : ఇతరుల సంతోషం

ఇతరులలో సహజమైన సంతోషం
కెరటంలా విరిగిపడటం చూసినపుడు,
కాసేపు, నిన్ను నువు కోల్పోతావు,
లేదా, నిన్ను నువు పొందుతావు

సంతోషం జీవిత పరమావధి అని
కెరటం చివరి జల్లులు చెబుతాయి,
ఊరికే సంతోషంగా ఉండటం బావుంటుంది
ఉన్నతోన్నత గమ్యాలు చేరటం కన్నా,
సంపదా, జ్ఞానం, కీర్తీ సేకరించటం కన్నా

ఒకనాడు దేవుని ముందు నిలుస్తావనుకొందాం,
పుణ్య, పాపాల లెక్కలు అటుంచి,
ఎంత సంతోషించా, వెంత దుఃఖించావని 
యథాలాపంగా అడిగాడనుకొందాం 

పోనీ, యథాలాపం కాదు,
తన సృష్టిని నువ్వెంత మెచ్చావో, నొచ్చావో
తెలుసుకునే యత్న మనుకుందాం,
ఆ పెద్దప్రాణంపై గౌరవంతో
ఆహా, జీవిత మద్భుతమని చెప్పావనుకుందాం

నువు చెప్పింది నిజమో, కాదో నీకు తెలీదు,
నీకో జీవితముండటం నిజమో, కాదో తెలీదు,
ఇదంతా అసలుందో, లేదో తెలీదు

కానీ, ఇతర్ల సంతోషంలోకి
అదాటున మునిగే క్షణాలుంటాయి చూసావా,
ఇతర్ల దుఃఖంలో, అప్రయత్నంగా 
మునిగే సమయాలుంటాయి చూసావా

అపుడు జీవన సారమేదో
నీ ప్రక్క నుండి వెళ్ళిపోయే ఓడలా
అంటీ, అంటక తాకుతుంది

భారమైన తీరం
నిను మృదువుగా అనంతంలోకి నెడుతుంది,
దూరపు ఆనంద సముద్రం 
తన లోనికి, లోనికి పిలుస్తుంది

బివివి ప్రసాద్