11 అక్టోబర్ 2025

కవిత : నీపై రోజులు

కొన్ని రోజులు దయగా ఉంటాయి నీపట్ల,
బంగారుకాంతిలోనో, నీటిపొరపై మిలమిలలలానో,
మరికొన్ని అగ్నిలానో, పొగలానో, బూడిదలానో ఉన్నట్లు
ఇదంతా వెలుగు నీడల ఆట

తల్లి చుట్టూ దాగుడుమూతలు ఆడే బిడ్డల్లా 
నీ చుట్టూ దాగుడుమూతలు ఆడతాయి
పగళ్ళూ, రాత్రులూ, ఆనందాలూ, దుఃఖాలూ 

నువు కదిలిపోయినట్టుంటావు, కదలవు,
ఏడ్చినట్టూ, నవ్వినట్టూ తోస్తుంది
ఏమీ చేయవు, చేయలేవు

ఉత్త ప్రశాంతత నీవైనట్లు,
ఉత్త ఖాళీ నీవైనట్లు,
అర్థంలేనితనం నీవైనట్లు

వెర్రివాడిపై కురిసే ఎండలా, నీడలా,
వానలా, వెన్నెలలా, మంచుతెరల్లా 
జీవితం నీపై కురుస్తూ వుంటుంది

రోజుల పెట్టెల్లో దాచిన అనుభవాలు ఒంపుతుంది,
రోజుల గదుల్లోని పనులు నీతో చేయిస్తుంది

ఇంతా చేసి ఇది జీవితం,
అనుభవాల అనుభవం,
నక్షత్రాల సమూహం,
నక్షత్రాలు ఈదే నల్లని కాంతిసముద్రం

దయగల రోజులూ, దయలేని రోజులూ 
గడిచిపోతాయి నువు కావాలన్నా, వద్దన్నా

ఇక మిగిలేదల్లా నువ్వు
విశాలమైన మైదానంలో
గొల్లబాలుని పిల్లనగ్రోవి పాటలా
తెరలు తెరలుగా వ్యాపించే,
ఎప్పటికీ వ్యాపిస్తూ ఉండే నువ్వు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి