04 అక్టోబర్ 2025

కవిత : గది బయట

ఆయనన్నది నిజమనుకుందాం,
నువు గదిలో వున్నపుడు, గోడల కవతల 
ఉత్త ఖాళీ మినహా లోకమనేదేమీ లేదు,
గోడల కవతల గతం లేదు, భవిత లేదని,
ఊరికే ఊహించుదాం, నమ్ముదాం

నమ్మకాలు, శబ్దాల గింజలు చల్లితే వాలే పావురాలు 
గనక, నమ్మటమేమీ కష్టం కాదనుకుందాం

గది కవతల ఉత్త ఖాళీ మినహా, 
ఆకాశం కూడా లేని, ఖాళీ కన్నా లోతైన ఖాళీ మినహా,
ఏమీ లేదనుకుందాం
ఏమైనా ఉందో, లేదో, తెలీదో, తెలుసో చెప్పలేని,
అయోమయంలో ఉన్నామనుకుందాం

భాషని భుజించి బ్రతికే కనరాని ఇంద్రియమొకటి 
భాషని దాటలేక, భాషలో బ్రతికే ఊహని దాటలేక,
చతికిలబడిందనుకుందాం

అపుడు, గది వెలుపలి ఖాళీనే గది లోపల ఉంటుంది,
రెక్కలపై ముసిరిన వల చెరిగిపోయి,
పక్షి గగనంలో తేలుతుంది

ఆయనన్నది కాసేపు నిజమనుకుందాం
గదిలోనే కూర్చుని, గది బయటి ఖాళీ లో 
మునుగుదాం లేదా తేలుదాం

• ఆయన : ఒక మిస్టిక్, ఒక గురువు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి