07 అక్టోబర్ 2025

కవిత : వాన కురిసే రాత్రి

వాన కురిసే రాత్రి నువు ఒంటరివవుతావు,
సమీపంలో ఎవరున్నా, లేకున్నా
నీకు వానా, వానకి నువ్వూ మిగులుతారు

చీకటి కురిసే రాత్రులు సైతం
ఒంటరిగా ఉంటావు గానీ,
చీకటిలో వాన కురిసిందా 
కలతల్లేని, కలల అవసరంలేని
గాఢనిద్రలోకి జారుకుంటావు

వాన కురిసే వేళ 
నీకు నువ్వు నిజంగా దక్కుతావు
నిన్నెటూ కదలనీయని వానలో,
నీ ఊహల్లోకి చొరబడే వానలో
నీకు అక్కర్లేని నువ్వు చెరిగిపోయి, 
నీకు నువు కొత్తగా పరిచయమౌతావు

వాన కురవటమంటే జీవితం కురవటం గనక
వాన కురిసేవేళ నిన్ను నువు ప్రేమిస్తావు,
నీ జీవితాన్ని మోహిస్తావు,
ఎడతెగని వాన నిన్ను కాగితం పడవ చేసి
ఎటైనా తీసుకుపోతే బాగుండునని ఎదురుచూస్తావు

వాన కురిసే వేళ కాస్త భయపడినా గానీ,
నోవా పడవకి దొరకకుండా
అవధుల్లేని జలధిలో కొట్టుకుపోవాలని కలగంటావు 

వాన కురిసే వేళ 
వాన ఒక్కటే, వానలాంటి కరుణ ఒక్కటే
సృష్టిలో మిగలాలని దేవతల్ని బ్రతిమాలుకుంటావు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి