ఒక్కటి మాత్రం చాతకాలేదు నీకు
ఆ నిమిషంలో సంతోషంగా ఉండటం,
ఇతరుల్ని సంతోషంగా ఉండనీయటం
అలాగని, బుద్ధిహీనుడివీ, స్వార్థపరుడివీ కావు
నువు వదలలేని గాయాల భారం,
నిన్ను వదలలేని కలల తేలికదనం
నిన్ను ఈ నిముషంలో ఉండనీయలేదు
ఈ క్షణంలోకి ప్రవహించటమెలానో,
క్షణాన్ని నీలో ప్రవహింపనీయటమెలానో
సృష్టిలో ఇంతకాలమున్నా చాతకాలేదు
బడిలో చివరిబల్ల విద్యార్థిలా,
ప్రవాహంలో తోచక నిలిచిన ఎండిన చెట్టులా
జీవితాన్ని చూస్తున్నావు
ఆ ఒక్కటీ నేర్చుకుంటే చాలని
ఒడ్డున కూర్చుని ఈతలోని ఆనందాన్ని
వర్ణించినట్టు వర్ణించావు
అలాగని, మర్యాదస్తుడివీ, పిరికివాడివీ కావు
నువ్వు వదలలేని ఆలోచనల భారం,
నిన్ను వదలలేని అనుభూతుల తేలికదనం
నిన్ను ఈ నిముషంలో బ్రతకనీయలేదు
రాత్రి వెన్నెలలో పక్షి కూత కరిగిపోయినట్టు,
చీకటిలో ఇంత విశాలదృశ్యం భద్రంగా నిద్రపోయినట్టు,
ఉదయాకాశం కాంతిలోకి ఒళ్ళు విరుచుకున్నట్టు,
దుఃఖితులని చూసి దయాకమలం వికసించినట్టు
సహజంగా, సరళంగా, జీవితం కోనేటిలో
నీ బిందువులోని ఆకాశాన్ని కరిగించటమెలానో
నీకిప్పటికి చాతకాలేదు
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి