03 అక్టోబర్ 2025

కవిత : ఆగటం

ఆగటం మినహా వేరే దారి వుండదు,
ఉద్వేగాలని ఆపటం మినహా

రాలిపోయే ఎండుటాకు మరో క్షణం ఆగినట్టు,
వికసించే పూలరేకులు ఆలోచనలో పడినట్టు
లోపల్నించి రాలే మాటలని, ఉద్వేగాలని 
కాసేపు ఆగమనటం మినహా,
భద్రమైన నిర్ణయం కనబడదు
ఇక్కడ ఇలా వుంటుంది,
నీకేమీ తెలియదు కొన్నిసార్లు, ఆగిపోవటం మినహా

ఆగిపోయిన క్షణాలు
జీవితాన్ని ఎటూ కదలనీయక పోవచ్చును,
ఆగలేకపోయే క్షణాలు చూపించే మలుపుల కంటే
ఆగటం సరైనది కావచ్చును

ఎక్కడ ఆగాలో, కూడదో, నీ స్వంత నిర్ణయమో, 
ఏ శక్తుల ఆటనో నీకు తెలియక పోవచ్చును

ఏమైనా, ఆగటం మినహా
ఆగి, ఇవాళ రాత్రి చంద్రుడెపుడు ఉదయించాడో,
వెన్నెల ఎంత నిశ్శబ్దాన్ని లోకానికి కానుక చేసిందో,
లోకపు దుఃఖమో, నాటకమో 
నీలోంచి ఎంత పలికిందో చూసుకోవటం మినహా,
ఇవాళ పెద్దగా పనేమీ లేకపోవచ్చును

నిజానికి, ఆగిన క్షణాల్లో, 
నువు జీవితానికి అతి దగ్గరగా
చలించే గ్రహంలా ఉండి వుండవచ్చును

ఆగిన క్షణాలు నిన్ను నీకు మిగల్చక పోవచ్చును,
నిన్ను మాత్రమే నీకు మిగల్చవచ్చును

అప్పుడపుడు ఆగటం బావుంటుంది,
సెలయేరు ఆగి కోనేరు అయినట్లు,
చంద్రుడు ఆగి కోనేటిలో చూసుకున్నట్లు,
తుమ్మెద ఆగి పూలరేకులు చూసినట్లు,
పూలు వికాసం ఆపి తుమ్మెదని పిలిచినట్లు,
తీరికవేళ వీధి అరుగుపై మనిషి మాటలకు పిలిచినట్లు,
సాయంత్రపు గగనంలో చివరి రంగులు ఆగి
ఇంకెవరైనా చూసే వాళ్ళున్నారా అని అడిగినట్లు

ఊరికే ఆగటం బావుంటుంది
ఆగి, జీవితం లాంటి నిన్నూ, నీలాంటి జీవితాన్నీ
మనసారా కావలించుకోవడం బావుంటుంది

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి